English | Telugu
`ఆదిపురుష్`: హనుమాన్ అతడేనా?
Updated : Jun 25, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో శ్రీరామచంద్రుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు ప్రభాస్. ఆయనకి జంటగా సీత పాత్రలో `1 నేనొక్కడినే` ఫేమ్ కృతి సనన్ కనిపించనుండగా.. రావణుడి వేషంలో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి భూమికలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. కాగా, శ్రీరామ బంటు హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారో ఇప్పటివరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో మరాఠి నటుడు దేవదత్ నాగే.. హనుమాన్ పాత్రని ధరించనున్నాడట. `జీ మరాఠి`లో ప్రసారమైన `జై మల్హార్` ధారావాహికలో మహాశివుని మరో అవతారమైన ఖాన్ దోబా వేషంలో అలరించి పేరుప్రఖ్యాతులు గడించాడు దేవదత్. అలాగే `సత్యమేవ జయతే` చిత్రంతో పాటు ఓమ్ రౌత్ రూపొందించిన `తానాజీ`లోనూ కీలక పాత్రలు పోషించాడు. కట్ చేస్తే.. `ఆదిపురుష్` రూపంలో మరోసారి `తానాజీ` కెప్టెన్ నుంచి దేవదత్ మరో బంపర్ ఆఫర్ అందుకోవడం వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే `ఆదిపురుష్`లో దేవదత్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
ఇదిలా ఉంటే.. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తయారవుతున్న `ఆదిపురుష్`.. 2022 ఆగస్టు 11న థియేటర్స్ లో సందడి చేయనుంది.