English | Telugu

`ఎన్టీఆర్ 30`.. అనిరుధ్ కి భారీ పారితోషికం?

`జ‌న‌తా గ్యారేజ్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. అతి త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2022 ఏప్రిల్ 29న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `ఎన్టీఆర్ 30` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ సినిమాకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ బాణీలు అందించ‌బోతున్నాడ‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం సాగుతోంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. పొలిటిక‌ల్ డ్రామాగా రూపొంద‌నున్న`ఎన్టీఆర్ 30`కి అనిరుధ్ కంపోజ‌ర్ గా ఫిక్స్ అయిన‌ట్టేన‌ని.. దాదాపు రూ.4 కోట్ల భారీ పారితోషికం ఈ సినిమా కోసం అందుకోబోతున్నాడ‌ని వినిపిస్తోంది. అదే గ‌నుక నిజ‌మైతే.. టాలీవుడ్ లో ఓ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కి ఇంత మొత్తం రెమ్యూన‌రేషన్ గా ఇవ్వ‌నుండ‌డం ఓ రికార్డ్ అనే చెప్పాలి. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, తార‌క్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 13న ఈ పిరియ‌డ్ డ్రామా రిలీజ్.