English | Telugu

మరోసారి మెగాస్టార్ మూవీలో అనసూయ!

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వెండితెరపైనా వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. 'క్షణం', 'రంగస్థలం' వంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల 'పుష్ప ది రైజ్', 'ఖిలాడి' సినిమాలతో అలరించించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆచార్య, పక్క కమర్షియల్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న అనసూయ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మరో మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భోళా శంకర్'. తమిళ్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అనసూయను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆచార్య' సినిమాలో అనసూయ ఓ పాత్రలో నటించినట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ మూవీలో ఛాన్స్ దక్కించుకుందని న్యూస్ రావడం విశేషం. ఇదిలా ఉంటే 'భోళా శంకర్'లో మరో యాంకర్ రష్మి కూడా నటిస్తోంది.

కాగా, అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పార్ట్-1 లో నటించిన అనసూయ.. పుష్ప పార్ట్-2 లోనూ నటించనుంది. ఇలా వెంటవెంటనే బన్నీ సినిమాలలో సందడి చేయనున్న ఈ భామ.. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలలోనూ వరుస అవకాశాలు దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది.