English | Telugu

శిరీష్‌కి అంత సీన్ ఉందా??

గౌర‌వం సినిమాతో తెర‌పైకొచ్చాడు అల్లు శిరీష్‌. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఎలాగైనా స‌రే త‌న‌యుడికి హిట్టివ్వాల‌ని అల్లు అరవింద్ శిరీష్‌ని తీసుకెళ్లి మారుతి చేతిలో పెట్టారు. కొత్త జంట సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడింది. దాంతో కొంత విరామం తీసుకొని శ్రీ‌ర‌స్తు - శుభ‌మ‌స్తు అనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్‌తో వ‌చ్చాడు శిరీష్‌. గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమా కాస్త బెట‌రే అని చెప్పాలి. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ఈ సినిమా కాస్త‌లో కాస్త గ‌ట్టెక్కేసింది. అయితే చుట్టుప‌క్క‌ల మంచి సినిమాలు లేక‌పోవ‌డంతో కొన్ని వ‌సూళ్లూ ద‌క్కాయి. అయితే బాబు బంగారం, జ‌న‌తా గ్యారేజ్ వ‌చ్చాక శిరీష్ సినిమా బాగా డ‌ల్ అయ్యింది. అయినా స‌రే.. ఓవ‌ర్సీస్‌లో ఈసినిమాని రీ రిలీజ్ చేసి అక్క‌డ బాగా వ‌సూళ్లు పిండేద్దాం అని ప్ర‌య‌త్నించారు. కానీ ఆ ప్ర‌యోగం వ‌ర్క‌వుట్ కాలేదు. అల్లు అర‌వింద్ చేతిలో ఉన్న థియేట‌ర్ల‌లో... శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాని బ‌ల‌వంతంగా ఆడించార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టోట‌ల్ క‌ల‌క్ష‌న్లు రూ.20 కోట్లు వ‌చ్చాయ‌ని కొత్త లెక్క‌లు చెబుతోంది గీతా ఆర్ట్స్‌. ఈ సినిమా ప‌ట్టుమ‌ని రూ.8 కోట్లు కూడా కొట్ట‌లేద‌ని, రూ.20 కోట్ల‌న్న‌ది కేవ‌లం కాకి లెక్క‌లే అని ట్రేడ్ వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి. 50 రోజులు ఆడింది కూడా గీతా ఆర్ట్స్ చేతిలో ఉన్న థియేట‌ర్ల‌లోనేన‌ని.. దాన్ని బ‌ట్టి ఈసినిమాని ఆడించేశార‌ని చెప్పుకొంటున్నారు. ఎంత ఆడించినా గ‌త సినిమాల కంటే శిరీష్ నుంచి బెట‌ర్ అవుట్ వ‌చ్చినందుకు సంతోషించాల్సిందే.