English | Telugu
మరోసారి `రేసు గుర్రం` కాంబో!?
Updated : Apr 9, 2022
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిల్మోగ్రఫీలో `రేసు గుర్రం` చిత్రానికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. 2014 వేసవిలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. అప్పట్లో బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించింది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో బన్నీ చేసిన మొదటి సినిమాగా రికార్డులకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరేట్ మూవీ.
ఇదిలా ఉంటే, `రేసు గుర్రం` తరువాత మళ్ళీ జట్టుకట్టని అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి .. త్వరలో మరోమారు కలిసి పనిచేయనున్నారట. ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని బజ్. అంతేకాదు.. బన్నీ హోమ్ బేనర్ గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని అంటున్నారు. అలాగే, పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కే అవకాశముందని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఒకవైపు `పుష్ప` సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్`ని పట్టాలెక్కించే పనిలో బన్నీ ఉండగా.. మరోవైపు అక్కినేని అఖిల్ తో `ఏజెంట్` పూర్తిచేసే పనిలో ఉన్నారు సురేందర్ రెడ్డి. అదేవిధంగా, `ఏజెంట్` అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ సూరి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. సో.. ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే `రేసు గుర్రం` కాంబో మరోసారి జట్టుకట్టే అవకాశముందన్నమాట.