English | Telugu
బన్నీ..కొంచెం తగ్గు అంటున్న పవన్ ఫ్యాన్స్..!
Updated : May 11, 2016
ళ
మెగా అభిమానుల అండ దండలు లేనిదే...ఏ మెగా హీరో ఎదగడన్నది వాస్తవం. అల్లు అర్జున్ ఎదుగుదలకూ వాళ్లే కారణం. సినిమాల్లో చిరంజీవి వైభవం కాస్త తగ్గాక, అభిమాన బలాన్ని పెంపొందించి.. ఫ్యాన్స్‌ని చీలిపోకుండా చేశాడు పవన్ కళ్యాణ్. పవన్ నిజాయతీ, అతను సాధించిన విజయాలు, పవన్ స్టైల్... వీటన్నింటికీ ఫ్యాన్స్ పెరుగుతూ వచ్చారు. చిరంజీవి ఫ్యాన్స్ తోపాటు.. తనకంటూ ఓ సొంత అభిమాన బలాన్ని పెంపొందించుకొన్నాడు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ దృష్టిలో చిరంజీవి ఎంతో, పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఇంకా చెప్పాలంటే పవన్‌కే ఎక్కువ సపోర్ట్ ఉంది. ఇదంతా తెలిసి కూడా అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్న తీరు... పవన్ ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. ఇటీవల సరైనోడు ఆడియో సక్సెస్ మీట్‌లో అభిమానులు పవన్ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడను అంటూ మొహమాటం లేకుండా చెప్పేశాడు. అంతేకాదు... చిరంజీవి రోడ్లు వేస్తే. అందులో కార్లో వెళ్లేవాడు గొప్పవాడు కాదని పరోక్షంగా పవన్‌ని చురక అంటించాడు.
ఆతరవాత బన్నీని కొంతమంది పవన్ అభిమానులు కలుసుకొన్నారని తెలుస్తోంది. పవన్ గురించి అలా మాట్లాడాల్సింది కాదని అభిమానులు అభిప్రాయపడినా.. `నేను మాట్లాడినదాంట్లో తప్పేం లేదు. ఇక నుంచి పవన్ గురించి ఎక్కడా మాట్లాడను` అనేసరికి.. పవన్ ఫ్యాన్స్ షాక్ తిన్నారట. బన్నీ ఎదుగుదలలో పవన్ అభిమానుల వాటా కూడా ఉందన్నది అక్షరసత్యం. అలాంటిది బన్నీ చేష్టలు.. పవన్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు ఏమాత్రం నచ్చడం లేదు. దాంతో `బన్నీ కాస్త స్పీడు తగ్గించు` అంటూ పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చతుర్లు వేస్తున్నారు. సరైనోడులో బన్నీ విసిరిన డైలాగులు కొన్నిటిని మార్చి.. ''టన్నుల కొద్దీ దమ్ములు పోయి దద్దమ్మలుగా మిగలాల్సివస్తుంది ''అంటూ ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది పవన్ వీరాభిమానులు బన్నీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. వీటన్నింటినీ బన్నీ గమనిస్తున్నాడు కూడా. చేసిన పొరపాటుని బన్నీ ఇప్పటికైనా గ్రహిస్తాడో లేదో.. తన తప్పు ఎలా సరిదిద్దుకొంటాడో, తన ఫ్యాన్స్ ని ఎలా కూల్ చేస్తాడన్నది ఆసక్తికరం.