English | Telugu

ప‌వ‌న్‌ వ‌ల్లే నిండా మునిగిపోయాడ‌ట‌...!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిత్రుడు, శ్రేయోభిలాషి, ప్ర‌స్తుతం ప‌వ‌న్ వెంటే ప్ర‌యాణంచేస్తున్న వ్య‌క్తి ఎవ‌రంటే శ‌ర‌త్ మ‌రార్ పేరే చెబుతారు. గోపాల గోపాల చిత్రానికి శ‌ర‌త్ మ‌రార్ స‌హ నిర్మాత‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌కీ ఆయ‌నే ప్రొడ్యూస‌రు. ఇప్పుడు ఎస్‌.జె.సూర్య‌తో చేయ‌బోతున్న చిత్రానికీ శ‌ర‌త్ మ‌రారే నిర్మాత‌. శ‌ర‌త్ ప‌వ‌న్‌ని వ‌ద‌ల‌డం కాదు... ప‌వ‌నే శ‌ర‌త్ మ‌రార్‌ని వ‌ద‌ల్లేక‌పోతున్నాడ‌ని, అందుకే త‌న‌తోనే సినిమాలు చేస్తున్నాడ‌ని ప‌వ‌న్ గురించి తెలిసిన వాళ్లంతా చెబుతుంటారు. అలాంటి శ‌ర‌త్ ఇప్పుడు ప‌వ‌న్ వ‌ల్లే ఆర్థికంగా బాగా కుంగిపోయాడ‌ని తెలుస్తోంది.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా ఆర్థికంగా శ‌ర‌త్‌కి తీవ్ర న‌ష్టాల్ని మిగిచ్చింది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర పోగొట్టుకొన్న దానికంటే... స‌ర్దార్ టెక్నీషియ‌న్లు, న‌టీన‌టుల విష‌యంలో చేసిన మార్పుల‌కూ, చేర్పులకూ పోగొట్టుకొన్న అడ్వాన్సుల‌కు, డిలీ అవ్వ‌డం వ‌ల్ల పెరిగిన వ‌డ్డీల‌కూ.. శ‌ర‌త్ న‌డ్డి విరిగిందని స‌ర్దార్ దెబ్బ‌కు కోలుకోలేకపోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఎస్‌.జే సూర్య సినిమాతో శ‌ర‌త్ క‌ష్టాల్ని తీర్చేద్దాం అని ప‌వ‌న్ ఫిక్స‌యినా, ఆ సినిమాకి పెట్టుబ‌డి పెట్టేంత స్థోమ‌త కూడా శ‌ర‌త్‌మ‌రార్‌కి ప్ర‌స్తుతానికి లేద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఆయ‌న ఫైనాన్సియ‌ర్స్ ద‌గ్గ‌ర్నుంచి అప్పులు తీసుకొస్తున్నాడ‌ట‌. దానికి తోడు ప‌వ‌న్ ఆర్థిక అవ‌స‌రాల‌న్నీ తీరుస్తోంది శ‌ర‌త్ మారారే. అటు ప‌వ‌న్‌నీ, ఇటు సినిమానీ చూసుకోవ‌డం శ‌ర‌త్‌కి త‌ల‌కు మించిన భారం అవుతోంద‌ని, అయినా ప‌వ‌న్‌పై ఉన్న ప్రేమ‌తో అవ‌న్నీ భ‌రిస్తున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. సూర్య సినిమా హిట్ట‌యితే త‌ప్ప‌. శర‌త్ మ‌రార్ క‌ష్టాలు తీర‌వు.