English | Telugu

రెండు భాగాలుగా `పుష్ప‌`?

`ఆర్య‌`, `ఆర్య 2`తో అల‌రించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ - రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ త్ర‌యం.. త్వ‌ర‌లో `పుష్ప‌`, `పుష్ప 2` అంటూ ప‌ల‌క‌రించ‌బోతున్నారా? అవునన్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ బ‌జ్.

వివ‌రాల్లోకి వెళితే.. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `పుష్ప‌`. టైటిల్ రోల్ అయిన పుష్ప‌రాజ్ గా బ‌న్ని న‌టిస్తుండ‌గా.. అత‌నికి జంట‌గా ర‌ష్మిక మంద‌న్న సంద‌డి చేయ‌నుంది. మాలీవుడ్ యాక్ట‌ర్ ఫాహ‌ద్ ఫాజిల్ బ్యాడీగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. డీఎస్పీ బాణీలు అందిస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ పాన్ - ఇండియా మూవీగా `పుష్ప‌` రూపొందుతోంది.

కాగా, ఇప్ప‌టికే కొంత‌మేర చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. రెండు భాగాలుగా `పుష్ప‌` రాబోతోంద‌ట‌. అంతేకాదు.. ముందుగా అనుకున్న‌ట్లుగా ఆగ‌స్టు 13న కాకుండా ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ సీజ‌న్ లో మొద‌టి భాగాన్ని.. అలాగే వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో `పుష్ప` సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.

`పుష్ప‌`ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి కార‌ణంగా చిత్రీక‌ర‌ణ‌కు తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంది `పుష్ప‌` యూనిట్.