English | Telugu

అఖిల్ - నితిన్‌...పారితోషికం గొడ‌వ‌

అఖిల్ సినిమాపై ఎన్ని రూమ‌ర్లొచ్చాయో? ఈసినిమా నాగ్‌కి న‌చ్చ‌లేద‌ని, అందుకే రీషూట్ చేస్తున్నార‌ని చెప్పుకొన్నారు. ఈ సినిమా దీపావ‌ళికి రావ‌డం లేద‌ని అని కూడా అనుకొన్నారు. ఈ సినిమా అంద‌రి అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ దీపావ‌ళికి వ‌చ్చేసింది. సినిమా విడుద‌లైనా... అఖిల్‌పై రూమ‌ర్లు మాత్రం ఆగ‌డం లేదు. పారితోషికం విష‌యంలో ఇటు నాగార్జున కాంపౌండ్‌కీ అటు నితిన్ కాంపౌండ్‌కీ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌న్న‌ది లేటెస్ట్ టాక్‌.

ఈ సినిమా మొద‌లెట్టేట‌ప్పుడు అఖిల్‌పారితోషికం గురించి ఏం మాట్లాడుకోలేదు. `చివ‌రికి ఎంతో కొంత సెటిల్ చేసుకొందాం` అనే ఆలోచ‌న‌తోనే ఉండిపోయారు. ఈసినిమాకొచ్చిన క్రేజ్ దృష్ట్యా.. జ‌రిగిన మార్కెట్ దృష్ట్యా అఖిల్ పారితోషికం కూడా భారీ ఎత్తునే ఇవ్వాల‌ని నాగ్ డిమాండ్ చేశాడ‌ట‌. నితిన్ డాడీ సుధాక‌ర్ రెడ్డి అఖిల్‌కి రూ.5 కోట్ల పారితోషికం ఆఫ‌ర్ చేశాడ‌ని, అయితే.. నాగ్‌కి ఈ అంకె న‌చ్చ‌లేద‌ని... క‌నీసం ప‌ది కోట్లు ఇవ్వాల్సిందే అని ప‌ట్టుప‌ట్టాడ‌ని తెలుస్తోంది. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం ఆరు కోట్ల వ‌ర‌కూ వెళ్లి ఆగింద‌ట‌. `సినిమాకి న‌ష్టాలొచ్చాయి. దాన్ని నేను భ‌రించాలి క‌దా..` అంటూ నితిన్ కూడా అఖిల్ ద‌గ్గ‌ర త‌న వాద‌న వినిపించాడ‌ట‌.

వినాయ‌క్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకొన్నాడ‌న్న టాక్ వినిపిస్తోంది. అంటే హీరో, ద‌ర్శ‌కుల పారితోషికంకింద అఖిల్ సినిమాకి దాదాపు రూ.20 కోట్లు ఎగిరిపోయాయ‌న్న‌మాట‌. మ‌రి నాగ్ ఆరు కోట్ల‌కు ఒప్పుకొంటాడో, లేదంటే ప‌ది కోట్లూ ఇవ్వాల్సిందే అని ప‌ట్టుప‌డ‌తాడో చూడాలి.