English | Telugu

అజ్ఞాతవాసి హీరో అన్యాయం చేశాడా..?

ఒక సినిమాను ప్రేక్షకులు ఏం చూసి వెళతారు.. ఇదేం పిచ్చి ప్రశ్న.. హీరోని చూసి.. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోని డామినేట్ చేసి డైరెక్టర్లను బట్టి, కథను బట్టి సినిమాలకు వెళ్లేవారి సంఖ్య రీసెంట్ డేస్ ఎక్కువయ్యారు. కానీ రజనీకాంత్, పవన్‌కళ్యాణ్, మహేశ్ లాంటి సూపర్‌స్టార్లు మాత్రం దీనికి అతీతులు. కథ ఎంత బలంగా ఉన్నా.. ఎంతటి క్రియేటివ్ డైరెక్టర్ సినిమాని టేకప్ చేసినా.. ఆడియన్స్ సినిమాకు వెళ్లేది మాత్రం వీరిని చూసే. అయితే సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు ఘోరంగా ఫ్లాపవ్వడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డీలా పడ్డారు.

ఈసారి కొడితే గట్టిగా కొట్టాలని.. ఫ్యాన్స్‌లో జోష్ తీసుకురావాలని భావించిన ఆయన తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్‌‌‌తో జోడి కట్టి అజ్ఞాతవాసి సినిమా తీశాడు. దీంతో ఈసారి పవన్‌కు హిట్ గ్యారెంటీ అని అభిమానులు ఫిక్సయ్యారు. గతంలో వీరిద్దరి కాంభినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సూపర్‌ హిట్ అవ్వడమే అందుకు కారణం. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లను చూసిన వారికి త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేశాడనిపించింది. అంటే ఈ సినిమాకి హీరో త్రివిక్రమే అని చెప్పవచ్చు. కానీ అలా త్రివిక్రమ్ మీద నమ్మకంతో జనవరి 10న.. అజ్ఞాతవాసి సినిమాకి వెళ్లిన చాలా మందిని మాటల మాంత్రికుడు నిరాశ పరిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఎంతటి వీక్ పాయింట్‌ని అయినా సెల్యూలాయిడ్ మీద చక్కగా వివరించే త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మాత్రం పప్పులో కాలేసాడట. సన్ ఆఫ్ సత్యమూర్తి, అ ఆల రేంజ్‌లో కూడా ఎమోషన్ సీన్స్ డీల్ చెయ్యలేకపోయాడట. త్రివిక్రమ్ మీద పవన్ అభిమానులు పెట్టుకున్న ఆశలు ఫస్ట్ హాఫ్‌తోనే ఆవిరి అయిపోయాయట. రెండు డైలాగులు, నాలుగు ఎమోషన్ సీన్స్, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో సినిమా తీసేస్తే.. ఆడేస్తుందని త్రివిక్రమ్ బాగా నమ్మినట్లున్నాడు అంటూ అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. సంక్రాంతి సీజన్ కావడం త్రివిక్రమ్ మీద ఫ్యామిలీ ఆడియన్స్‌‌కి కాస్త నమ్మకం ఉండటంతో మొదటి వారంలో అజ్ఞాతవాసి గట్టెక్కొచ్చు అని అభిమానులే పెదవి విరుస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి దీనిని ఒక గుణపాఠంగా తీసుకుని తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌నైనా త్రివిక్రమ్ సరిగా టేకప్ చేయాలని ఆశించాలి అంటున్నారు విశ్లేషకులు.