English | Telugu

థియేట‌ర్లు కావాలా నాయినా...?!!


ఈ సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు దండ‌యాత్ర చేశాయి. ప్ర‌తీ సినిమాకీ థియేట‌ర్ల స‌మ‌స్యే ఎదురైంది. చేసేదేం లేక దొరికిన థియేట‌ర్ల‌తో నాలుగు సినిమాలూ స‌ర్దుకుపోయాయి. మ‌రీ ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయిన థియేట‌ర్ల కొర‌త‌తో అల్లాడిపోయింది. సంక్రాంతి సీజ‌న్ వెళ్లిపోయింది... వ‌సూళ్ల జోరు త‌గ్గింది.. దాంతో ఇప్పుడు థియేట‌ర్లు వ‌దులుకోవ‌డానికి కొన్ని సినిమాలు సిద్ధ‌ప‌డుతున్నాయి. డిక్టేట‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తోని రెండో వారం నుంచీ చాలా థియేట‌ర్ల‌లో లేపేశారు. అలాంటి థియేట‌ర్లు ఇంచుమించు 400 వ‌ర‌కూ ఉన్నాయి. ఈ వారం కొత్త సినిమ‌లేవీ రావ‌డం లేదు. దాంతో 400 థియేట‌ర్ల‌లో సినిమా లేకుండా పోయింది.

`థియేట‌ర్లు కావాలా నాయినా` అంటూ సోగ్గాడే చిన్ని నాయిన, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల‌కు థియేట‌ర్ య‌జ‌మానులు ఆఫ‌ర్లు ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. వాళ్లకేమో ఉన్న థియేట‌ర్ల‌లో సినిమాని ర‌న్ చేసుకొంటే చాలనిపిస్తోంది. చివ‌రికి వ‌చ్చిందాంట్లో స‌గం - స‌గం అనే ప్రాతిప‌దిక‌న ఈరెండు సినిమాల‌కూ థియేట‌ర్లు దొరికాయి. అదే.. ఈ వారం ఒక‌ట్రెండు సినిమాలు ప‌డితే ప‌రిస్థితి భిన్నంగా ఉండేది. ఎక్స్‌ప్రెస్‌రాజా అయినా సంక్రాంతికి వారం రోజులు ఆల‌స్యంగా.. అంటే ఈ శుక్ర‌వారం విడుద‌లైతే.. కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లు దొరికి, బంప‌ర్ బొనాంజా కొట్టేసేది. కొన్నిసార్లు ఆల‌స్య‌మూ మంచిదే. ఆ విష‌యాన్ని నిర్మాత‌లు గ్ర‌హిస్తే.. ఈ సంక్రాంతికి పోటీ త‌గ్గేది. నాలుగు సినిమాలూ లాభ‌ప‌డేవి.