English | Telugu

శ్రుతి..ఇదంతా చేసింది మ‌హేష్ కోస‌మేనా?

సినిమాల ప్ర‌భావం జ‌నాల‌పై ఎంతుందో తెలీదుగానీ, పంచ్‌డైలాగుల ప్ర‌భావం మాత్రం గ‌ట్టిగానే ఉంది - అన్నాడు ఆగ‌డులో మ‌హేష్ బాబు. పంచ్‌డైలాగులే కాదు.. సినిమాలూ జ‌నాల్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని మళ్లీ మ‌హేష్ బాబునే నిరూపించాడు. మ‌హేష్ న‌టించిన తాజా చిత్రం శ్రీ‌మంతుడు. ఊరి ద‌త్త‌త నేప‌థ్యంలో సాగే ఈ సినిమా బాక్సాఫీసు క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. ఊరిని ద‌త్త‌త తీసుకొని బాగు చేస్తే.. స‌మాజాలు, త‌ద్వారా దేశం మొత్తం బాగుప‌డుతుంద‌న్న పాయింట్‌జ‌నాల‌కు బాగా రీచ్ అయ్యింది.

మంచు విష్ణు 10 గ్రామాల్ని ద‌త్త‌త తీసుకొని ఆ ఊర్ల‌కు నీటి స‌ర‌ఫ‌రా అందించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు శ్రుతి హాస‌న్ కూడా ఇదే బాట‌లో న‌డుస్తోంది. త‌మిళ‌నాడులోని ఓ ప‌ల్లెటూరిని శ్రుతి ద‌త్త‌త తీసుకొంది. ఇప్పుడు ఆ ఊరిని ఎలా అభివృద్ధి ప‌ర‌చాలా అని ఆలోచిస్తోంద‌ట‌. ఇదంతా శ్రీ‌మంతుడు ప్ర‌భావ‌మేనా అని అడిగితే మాత్రం శ్రుతి సీరియ‌స్ అయ్యింది.

``నేను ఓ సినిమాలో న‌టించినంత మాత్రాన‌.. ఆ సినిమా ప్ర‌భావం, ఆ పాత్ర ప్ర‌భావం నాపై ప‌డ‌దు. శ్రీ‌మంతుడు సినిమాకంటే ముందే ఈ ఆలోచ‌న ఉంది. నిజానికి నాలుగేళ్ల నుంచీ నేను ద‌త్త‌త అనే విష‌యాన్ని సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నా. ఓ మంచి ప‌ని చేయాలంటే సినిమాలు చూడ‌క్క‌ర్లెద్దు. మ‌న‌సులో ఉంటే చాలు`` అని స‌మాధాన‌మిచ్చింది శ్రుతి. ఏదేమైతేనేంటి?? ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకొని అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. అది చాల‌దూ.. కంగ్రాట్స్ శ్రుతి.