English | Telugu

బ్రూస్లీపై.. శ్రీ‌మంతుడు ప్ర‌భావం చాలా ఉందిరోయ్‌

తెలుగు ద‌ర్శ‌కులు, హీరోల దృక్ప‌థాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోందిప్పుడు. ఇది వ‌ర‌కు అగ్ర హీరో సినిమా అంటే మాస్ మ‌సాలానే. టీజ‌ర్ చూపించినా, ట్రైల‌ర్ విడుద‌ల చేసినా.. మాస్ ని మెప్పించ‌డ‌మే ధ్యేయంగా సాగేవి ఆ ప్ర‌య‌త్నాలు. అయితే శ్రీ‌మంతుడులాంటి సినిమాలు ఆ దృక్ప‌థాల్ని పూర్తిగా మార్చేశాయి. క్లాసీ లుక్‌, సెంటిమెంట్ డైలాగ్స్, ప్యామిలీ ఎమోష‌న్స్‌కీ ఆడియ‌న్స్ పెద్ద‌పీట వేస్తార‌ని గ్ర‌హించారంతా. అందుకే ఇప్పుడు బ్రూస్లీ ది ఫైట‌ర్ సినిమా కూడా అదే దారిలో ప్ర‌యాణిస్తోంది.

రామ్‌చ‌ర‌ణ్ - శ్రీ‌నువైట్ల క‌లయిక‌లో రూపొందిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ఇటీవ‌ల చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైంది. టీజ‌ర్‌, టైటిల్ చూసి ఇదేదో ప‌క్కా యాక్ష‌న్ చిత్ర‌మే అనుకొన్నారు. అదే ముద్ర కొన‌సాగితే ఫ్యామిలీ ఆడియ‌న్స్ దూర‌మ‌వుతార‌న్న భ‌యం ప‌ట్టుకొందేమో... ఇప్పుడు లేటెస్టుగా మ‌రో టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈసారి మాత్రం ఫ్యామిలీ ఎమోష‌న్స్ కి పెద్ద పీట వేశారు. అచ్చం శ్రీ‌మంతుడులానే ఓ ఫీల్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారిందులో. దానికి తోడు ఈ సినిమా కథ విజేత, గ్యాంగ్ లీడ‌ర్ ల‌ను పోలి ఉంటుంద‌ని బ‌య‌ట టాక్‌.

అందులోలానే కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి క‌థానాయ‌కుడు చేసే సాహ‌సాల్ని ఇందులో చూడొచ్చ‌ట‌. అంటే.. రెండు చిరు సినిమాల్నీ, ఓ మ‌హేష్ బాబు సినిమానీ క‌లిపి చ‌ర‌ణ్ కోసం మిక్స్ చేశార‌న్న‌మాట‌. ఆ వంట‌కం ఎలా ఉంటుందో మ‌రి.