English | Telugu

అలాగైతే.. 'ధృవ‌' కూడా ఫ్లాపే!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సెంటిమెంట్లు ఎక్కువ‌. ఎవ‌రైనా స‌రే, దానికి అతీతులు కారు. పెద్ద హీరోలు సైతం సెంటిమెంట్ల‌ని పిచ్చ‌పిచ్చ‌గా న‌మ్ముతారు. సంక్రాంతికి ఓ హీరో హిట్ కొడితే.. మ‌రుస‌టి సంక్రాంతికి సినిమాని విడుద‌ల చేయాల‌ని ధ్యేయంగా పెట్టుకొంటాడు. ఓ సీజ‌న్‌లో సినిమా ఫ్లాప్ అయితే.. అదే సీజన్‌లో సినిమా విడుద‌ల చేయ‌డానికి ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించాల్సివ‌స్తుంది. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌కి కూడా సీజ‌న్ సెంటిమెంట్ భ‌య‌పెడుతోంది. రామ్‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మూవీ ధృవ ఈ ద‌స‌రాకి విడుద‌ల అవుతోంది. ద‌స‌రా మంచి సీజ‌నే. వ‌రుస‌గా సెల‌వ‌లొస్తాయి. సినిమా హిట్ట‌యితే వ‌సూళ్ల పండ‌గే. అయితే ఈ ద‌స‌రా సీజ‌న్ మాత్రం చ‌ర‌ణ్‌కి అచ్చు రాలేదు. ఇది వ‌ర‌కు ఇదే సీజ‌న్‌లో వ‌చ్చిన గోవిందుడు అంద‌రివాడేలే, బ్రూస్లీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గోవిందుడు ఫ‌ర్వాలేదు గానీ.. బ్రూస్లీ మాత్రం డిజాస్ట‌ర్‌గా మారింది. ఆ యాంటీ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే చ‌ర‌ణ్‌కి ముచ్చ‌టగా మూడో ఫ్లాప్ త‌ప్ప‌దు. కానీ రామ్‌చ‌ర‌ణ్ మాత్రం ఈసెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాన‌న్న ధీమాలో ఉన్నాడు. ఎందుకంటే త‌మిళంల‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన త‌ని ఒరువ‌న్ కి ఇది రీమేక్ సినిమా. అక్క‌డ అంత హిట్ట‌యితే ఇక్క‌డ క‌నీసం యావ‌రేజ్ అయినా అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు. అందుకే... కాస్త ధీమాగానే ఉన్నాడు. మ‌రి ధృవ చ‌ర‌ణ్‌కి ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో వేచి చూడాలి.