English | Telugu

బిగ్ బాస్-7 హోస్ట్ గా బాలయ్య.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హోస్ట్ లుగా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి ఆరో సీజన్ వరకు నాగార్జున హోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ షో నుంచి నాగార్జున తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి హోస్ట్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున తప్పుకుంటున్నట్లు ఆరో సీజన్ ముగింపు దశలోనే వార్తలొచ్చాయి. నాగార్జున తప్పుకోవడంతో ఏడో సీజన్ హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ లేదా రానా దగ్గుబాటి వ్యవహరించే అవకాశముందని కూడా టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ప్రముఖంగా బాలకృష్ణ పేరు మాత్రమే వినిపిస్తోంది.

ఇప్పటికే బాలకృష్ణ ఓటీటీలో 'అన్ స్టాపబుల్' షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ షో మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యి.. రెండో సీజన్ కూడా అదే రేంజ్ లో అలరిస్తోంది. ఆ షోలో బాలయ్య ఎనర్జీకి, ఆయన మాటలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆయన బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులు సైతం ఏడో సీజన్ కోసం ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా ఈ షో చేయడానికి అంగీకరించారని.. దీనికోసం ఆయన ఏకంగా రూ.10కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని సమాచారం.