English | Telugu

ప్లానింగ్ లేక‌పోతే ఎలా చైతూ...?

సినిమ‌లేదో వ‌రుస‌గా చేసుకొంటూ పోతున్నాడు గానీ, కెరీర్ ప‌రంగా ప‌క్కా ప్లానింగ్ లేకుండా పోయింది నాగ‌చైత‌న్య‌కి. ఏ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి? సినిమా సినిమాకీ మ‌ధ్య గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి అనే విష‌యంలో క‌నీసం దృష్టి పెట్ట‌డం లేదు. దానికి మ‌రో ఉదాహ‌ర‌ణ దొరికింది. నాగ‌చైత‌న్య చేతిలో ప్ర‌స్తుతం రెండు సినిమాలున్నాయి. సాహ‌సం స్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్. ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఒకేసారి పోటీ ప‌డ‌బోతున్నాయి. సెప్టెంబ‌రు 9న ప్రేమ‌మ్ సినిమాని విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే అదే డేట్‌లో సాహ‌సం స్వాస‌గా సాగిపో కూడా రాబోతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడో పూర్త‌య్యింది. కొన్ని కార‌ణాల వ‌ల్ల విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. సెప్టెంబ‌రు 9 కాక‌పోయినా.. ఆ నెల‌లోనే ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌న్న‌ది గౌత‌మ్ మీన‌న్ ప్ర‌య‌త్నం. అదే నెల‌లో ప్రేమ‌మ్ ఎలా విడుద‌ల చేస్తారు? సినిమా సినిమాకీ మ‌ధ్య క‌నీసం నెల రోజుల గ్యాప్ అయినా ఉండాలి క‌దా? ఇదే విష‌యంపై ప్రేమ‌మ్ నిర్మాత‌ల‌తో గొడ‌వ ప‌డుతున్నాడ‌ట చైతూ. 'న‌న్ను అడ‌క్కుండా రిలీజ్ డేట్ ఎలా ప్ర‌క‌టిస్తారు' అని ఫైర్ అయిన‌ట్టు స‌మాచారం. అందుకే ట్విట్ట‌ర్‌లోనూ వెంట‌నే స్పందించాడు చైతూ. ''ప్రేమ‌మ్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వ‌లేదు. అవ్వ‌గానే చెబుతా'' అని క్లియ‌ర్ చేశాడు. అంటే సెప్టెంబ‌రు 9న ప్రేమ‌మ్ రావ‌డం డౌటే అన్న‌మాట‌.