English | Telugu

కోనా.. ఇప్పుడేమంటావ్ నాన్నా..?

చిత్ర‌సీమ‌లో ద‌ర్శ‌కుడు - ర‌చ‌యిత‌ల బంధం చాలా కీల‌కం. వాళ్ల మ‌ధ్య ఏం జ‌రిగినా నాలుగ్గోడ‌ల మ‌ధ్యే ఉండాలి. ఎట్టి ప‌రిస్థితిల్లోనూ రోడ్డెక్క‌కూడ‌దు. కానీ కోన వెంక‌ట్ ఏం చేశాడు? రోడ్డెక్కి మైకు ప‌ట్టుకొని అరిచి మ‌రీ చెప్పాడు `నా సీన్లు మొత్తం పాడు చేశాడు శ్రీ‌నువైట్ల‌. ఆ 72 సీన్లూ వాడుకొని ఉంటే.. బ్రూస్లీ బంప‌ర్ హిట్ అవుదును` అన్నాడు. స‌రే.. ర‌చ‌యిత‌గా కోన క‌ష్టాన్ని శ్రీ‌నువైట్ల వృథా చేశాడే అనుకొందాం. కోన వెంక‌ట్ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అయ్యింద‌నుకొందాం. కానీ.. ఇప్పుడు శంక‌రాభ‌ర‌ణం ప‌రిస్థితేంటి? ఈ సినిమాకి క‌థ‌, మాట‌లు, స్ర్కీన్‌ప్లే, స‌మ‌ర్ప‌ణ‌, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌.. ఇలా అన్నీ చేసిపాడేశాడు కోన‌. కానీ సినిమా మాత్రం షెడ్డుకెళ్లింది. దీని కంటే... బ్రూస్లీ, అఖిల్‌సినిమాలే బెట‌ర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయ్‌. దాన్ని బ‌ట్టి.. శంక‌రాభ‌ర‌ణం సినిమాని కోన ఎంత గొప్ప‌గా తీశాడో అర్థం చేసుకోవ‌చ్చు.

ఓ స్టేట్ మెంట్ ఇచ్చేముందు, ఓ వ్య‌క్తిని విమ‌ర్శించే ముందు.. భ‌విష్య‌త్తులో ఆ త‌ప్పు తాను చేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. కానీ కోన ఆ మాట మ‌ర్చిపోయాడేమో అనిపిస్తోంది. ఈ సినిమా కోసం నంద‌న‌వ‌న‌మ్ అనే ద‌ర్శ‌కుడ్ని తీసుకొచ్చాడు. కానీ డైరెక్ష‌నంతా తానే చేసేశాడు. క‌నీసం ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త నంద‌న‌వ‌న‌మ్ కి అప్ప‌గించినా ఈ సినిమాలో కోన తాలుకూ పైత్య‌మైనా త‌గ్గేది అని కామెంట్ చేస్తున్న‌వాళ్లూ ఉన్నారు.

సో.. తాను వ‌దిలిన బాణాల‌కు తానే బ‌లి కావాల్సివ‌స్తోంది. ఇప్ప‌టికైనా స్టేట్‌మెంట్లు ఇచ్చే ముందు కోన ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది. ఆ శ్ర‌ద్ధేదో కాగితంపై పెట్టుంటే... శంక‌రాభ‌ర‌ణం ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ ఇప్పుడేం చేస్తాం.. ఇట్స్ టూ లేట్‌.