English | Telugu

క‌ష్ట‌మ‌రాయుడు

బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎన్నో అశ‌ల‌తో, అంచ‌నాల‌తో విడుద‌లైంది కాట‌మ‌రాయుడు. ప‌వ‌న్ సినిమా అంటే.. ఆ రేంజు వేరేలా ఉంటుంది. తొలిరోజు బాక్సాఫీసు దగ్గ‌ర అదే క‌నిపించింది. ఏకంగా రూ.23 కోట్లు సాధించి ప‌వ‌న్ స్టామినాకు అద్దం ప‌ట్టింది. అయితే రెండో రోజు వ‌సూళ్లు ఢ‌మాల్ మ‌న్నాయి. తొలిరోజులో స‌గం కూడా రాలేదు. కేవ‌లం రూ.5.5 కోట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సివ‌చ్చింది. మూడో రోజు ప‌రిస్థితి ఏం మార‌లేదు. తొలి మూడు రోజుల‌కు క‌లిపి రూ.35 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది కాట‌మ‌రాయుడు. ఈ సినిమా కి దాదాపుగా రూ.105 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఈ మొత్తం రాబ‌ట్టుకోవ‌డం క‌ష్టాతి క‌ష్టం. సోమ‌వారం నుంచి వ‌సూళ్లు భారీగా డ్రాప్ అయ్యే అవ‌కాశాలున్నాయి. బుధ‌వారం ఉగాది పండ‌గ సెల‌వు కాబ‌ట్టి.. ఆరోజు మ‌ళ్లీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల హ‌డావుడి క‌నిపించ‌వ‌చ్చు. ఎంత చూసుకొన్నా కాట‌మ‌రాయుడు మొత్తం వ‌సూళ్లు రూ.60 నుంచి 70 కోట్ల లోపే ఉంటుంది. అంటే... బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాట‌మ‌రాయుడు సినిమా ఫ్లాప్ అన్న‌మాట‌. ఈ సినిమా రిజ‌ల్ట్ జీర్ణించుకోవ‌డం అభిమానుల‌కు కాస్త క‌ష్ట‌మే. కానీ... రొటీన్ క‌థ‌, రొటీన్ పాత్ర‌ల‌తో వస్తే రిజ‌ల్ట్ ఇలానే ఉంటుంది మ‌రి.