English | Telugu

క‌బాలి తెలుగులో విడుదల అవుతుందా??

క‌బాలి అభిమానులు ఇది షాకింగ్ వార్తే! క‌బాలిని వెండి తెర‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేల క‌న్నుల‌తో ఎదురుచూస్తున్న ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి ఇది షాకింగ్ న్యూస్‌. క‌బాలి సినిమా తెలుగులో విడుద‌ల అవ్వ‌దా?? ఈ సినిమాని కావాల‌ని అడ్డుకోవ‌డానికి ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తున్నారా?? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఈ విషయాన్ని స్వ‌యంగా క‌బాలి తెలుగు నిర్మాత‌లు కూడా స్ప‌ష్టం చేశారు. కొంత‌మంది త‌మ సినిమాని అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని, అయినా స‌రే.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ సినిమా వ‌చ్చి తీరుతుంద‌ని నిర్మాతలు చెబుతున్నారు. క‌బాలి విడుద‌ల‌కు అడ్డుగా మారుతోంది.. లింగ సినిమానే. ఆ సినిమాని తెలుగులో భారీ రేట్ల‌కు కొని న‌ష్ట‌పోయారంతా.

ఆ న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌కుండా క‌బాలిని విడుద‌ల చేస్తానంటే ఒప్పుకోమ‌ని బ‌య్య‌ర్లు ప‌ట్టుప‌డుతున్నారు. దానికి తోడు చెన్నైలోని ప్ర‌భుఅనే ఓ పంపిణీదారుడు చెన్నై కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశాడు. క‌బాలి సినిమా విడుద‌ల కాకుండా స్టే ఇవ్వ‌మ‌ని కోర్టుని కోరాడు. లింగ స‌మ‌యంలో తాను కోటి రూపాయ‌లు న‌ష్ట‌పోయాడ‌ట‌. ఆ న‌ష్టాన్ని భ‌ర్తీ చేస్తాన‌ని ర‌జ‌నీ మాటిచ్చాడ‌ట‌. అవేం ప‌ట్టించుకోకుండా ఇప్పుడు క‌బాలి సినిమాని విడుద‌ల చేయ‌డానికి చూస్తున్నార‌ని, త‌న‌కు న్యాయం జ‌రిగేంత వ‌ర‌కూ క‌బాలి సినిమాని ఆపేయాల‌ని ప‌ట్టుప‌ట్టాడు ఆ డిస్టిబ్యూట‌ర్‌. తెలుగు ప‌రిశ్ర‌మ నుంచీ కొంత‌మంది బ‌య్య‌ర్లు కోర్టు నుంచి స్టే ఆర్డ‌ర్ తెచ్చుకోవ‌డానికి విప‌రీత ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌బాలి విడుద‌ల అవుతుందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ మ‌ధ్యాన్నం చెన్నై హై కోర్టు ఈ పిటీష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్ట‌నుంది.