English | Telugu
మళ్ళీ వస్తున్న `ప్రేమ దేశం` దర్శకుడు!
Updated : Aug 16, 2021
ప్రేమకథా చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో కోలీవుడ్ కెప్టెన్ కదిర్ ఒకరు. 30 ఏళ్ళ క్రితం విడుదలైన `ఇదయం` (తెలుగులో `హృదయం`)తో నిర్దేశకుడిగా తొలి అడుగేసిన కదిర్.. మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆపై `ఉళవన్`, `కాదల్ దేశమ్` (తెలుగులో `ప్రేమ దేశం`), `కాదలర్ దినమ్` (తెలుగులో `ప్రేమికుల రోజు`), `కాదల్ వైరస్` వంటి తమిళ సినిమాలను.. `నన్ లవ్ ట్రాక్` అనే కన్నడ చిత్రాన్ని రూపొందించారు కదిర్. వీటిలో `కాదల్ దేశమ్` అఖండ విజయం సాధించింది. తెలుగు అనువాదం `ప్రేమ దేశం` కూడా అదే బాట పట్టింది.
అయితే, `ప్రేమ దేశం` తరువాత ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ చూడలేకపోయిన కదిర్.. త్వరలో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందించనున్నారట. `ప్రేమదేశం` తరహాలో ఇది కూడా ముక్కోణపు ప్రేమకథా చిత్రమని కోలీవుడ్ టాక్. నూతన తారలతో, ప్రధానంగా తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేస్తారని బజ్. త్వరలోనే కదిర్ కొత్త చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న కదిర్.. రాబోయే సినిమాతోనైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.