English | Telugu

వినాయ‌క్‌ని క్లాస్ పీకిన చిరు..??


తొమ్మిదేళ్ల త‌ర‌వాత చిరంజీవి వెండి తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాడు.. ఖైదీ నెం.150తో. ఈ సినిమాతోనే చిరు భ‌విత‌వ్యం పూర్తిగా ముడిప‌డి ఉంది. ఇక మీద‌ట సినిమాలు చేయాలా?? లేదంటే అచ్చిరాని రాజ‌కీయాల‌తోనే స‌ర్దుకుపోవాలా అనేది ఈ సినిమా రిజ‌ల్ట్ డిసైడ్ చేస్తుంది. అందుకే త‌న 150వ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొన్నాడు చిరు. లెక్క‌ల్లో తేడా రాకూడ‌ద‌ని త‌మిళంలో హిట్ట‌యిన క‌త్తి క‌థ‌ని ఎంచుకొన్నాడు. వినాయ‌క్ అయితే మాస్ ప‌ల్స్ బాగా తెలుస్తుంద‌ని ఆయ‌న్ని ద‌ర్శ‌కుడిగా పెట్టుకొన్నాడు. త‌న నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకొంటారో అవ‌న్నీ ఈ క‌థ‌లో ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. వ‌సూళ్ల‌కు ఢోకా లేని సంక్రాంతి బ‌రిపై గురి పెట్టాడు. అంతా బాగానే ఉంది.

కాక‌పోతే సినిమా ఫైన‌ల్ కాపీ విష‌యంలో చిరు అసంతృప్తిగా ఉన్నాడ‌ట‌. మ‌రీ ముఖ్యంగా సీన్ ఆర్డ‌ర్‌పై చిరు వినాయ‌క్‌పై గుర్రుగా ఉన్నాడ‌ని టాక్‌. అందుకే చిరు మ‌ళ్లీ ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూర్చుని సీన్ల‌ని ముందుకీ వెన‌క్కీ మారుస్తున్నాడ‌ట‌. `ఇక నీ ప‌ని అయిపోయింది.. సినిమా అంతా నాకు వ‌దిలేయ్‌.. ` అంటూ వినాయ‌క్‌ని క్లాస్ పీకాడ‌ని, ప‌రుచూరి బ్ర‌దర్స్ మీదా చిరు.. కాస్త గుర్రుగానే ఉన్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. క్లైమాక్స్ సీన్ విష‌యంలోనూ చిరు సంతృప్తిగా లేడ‌ట‌. అందులో డైలాగుల డోసు ఎక్కువైంద‌ని గ్ర‌హించిన చిరు.. వాటిని ట్రిమ్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ని టాక్‌. సెన్సార్ వాళ్ల‌కు చూపించిన సినిమా డ‌మ్మీ కాపీ అని.. చిరు మార్పులు చేర్పులూ అయ్యాక‌నే ఫైన‌ల్ కాపీ త‌యార‌వుతుంద‌ని చెబుతున్నారు. సో.. సినిమా ఇక చిరు చేతుల్లోకి వెళ్లిపోయిన‌ట్టే. ఆయ‌న క‌త్తెర్లు ఏ రేంజులో ఉంటాయో.. వాటి అవుట్ పుట్ ఎలా త‌యార‌వుతుందో??