English | Telugu
ఈ నాలుగూ అంతంత మాత్రమేనా?
Updated : Jan 7, 2016
ఈ సంక్రాంతిని ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ నాలుగు సినిమాల మార్కెట్ దాదాపు రూ.150 కోట్లకు పైమాటే అని అంచనా! నాలుగు సినిమాలూ నిలబడి కాసులు కురిపిస్తే సంక్రాంతి సీజన్లో దాదాపు 200 కోట్లకు పైచిలుకు వ్యాపారమే జరుగుతుంది. కానీ.. ఒక్కటే షరతు.. సినిమా బాగుండాలంతే. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయినా, ఎక్స్ ప్రెస్ రాజా.. ఈ నాలుగు సినిమాలూ పోటీలో ఉన్నా జనం మాత్రం నందమూరి హీరోల సినిమాల గురించే మాట్లాడుకొంటున్నారు.
డిక్టేటర్ ఆల్రెడీ.. సెన్సార్ కూడా అయిపోయింది. బాలకృష్ణ గత సినిమాల ఫార్ములాలోనే ఈ సినిమా కూడా సాగుతుందని సమాచారం. కాకపోతే... గత సినిమాలకంటే స్టైలీష్‌గా కనిపించనున్నాడు బాలయ్య. అదే స్టైల్‌ని ఎన్టీఆర్ కూడా నమ్ముకొన్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా కోసం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ రెండు సినిమాలూ అంతంత మాత్రమే అని తెలుస్తోంది. అభిమానులుల్ని పదే పదే థియేటర్లకు రప్పించే అంశాలు ఈ రెండు సినిమాల్లోనూ లేవని, కామన్ ఆడియన్ జడ్జిమెంట్‌పైనే ఈ సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉందని టాక్.
మరోవైపు సోగ్గాడే చిన్నినాయినా కూడా అంతేనట. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిన ఈ సినిమా.. ద్వితీయార్థం వచ్చే సరికి చంద్రముఖి స్టోరీతో భయపెట్టే ప్రయత్నం చేసిందని.. అది ఎంత వరకూ ఎక్కుతుందో డౌటేనని చెబుతున్నారు.
ఇక ఎక్స్‌ప్రెస్‌రాజా కూడా భలే మంచి రోజు టైపు స్టోరీ నట. కథలో కొత్తదనం లేదని, కేవలం కామెడీనే నమ్ముకొని ఈ సినిమాని తీశారని చెప్పుకొంటున్నారు. కామెడీ వర్కవుట్ అయితేగానీ..ఈ సినిమాకి డబ్బులు రావు. సో.. ఈ నాలుగు సినిమాల పరిస్థితీ అంతంతమాత్రమే.. అన్నమాట. సంక్రాంతి సీజన్లో విడుదల కావడమే ఈసినిమాల బలం. అందుకే సినిమా ఎలాగున్నా. నాలుగు డబ్బులు మాత్రం వెనకేసుకోవచ్చు.