English | Telugu

బ‌న్నీని త‌ప్పుదారి ప‌ట్టిస్తోంది ఎవ‌రు?

తెలుగు మీడియా అల్లు అర్జున్ పై గుర్రుగా ఉంది. మ‌రీ ముఖ్యంగా ప్రింట్ మీడియా మ‌న‌సు నొచ్చుకొంది. డీజేకి సంబంధించిన ఇంట‌ర్వ్యూల ప‌ర్వం స‌జావుగా సాగ‌క‌పోవ‌డ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణం. ఒక్కో ప‌త్రిక‌కూ క‌నీసం 5 నిమిషాల స‌మ‌యం కూడా ఇవ్వ‌లేదు. దాంతో `ఇవేం ఇంట‌ర్వ్యూలు` అంటూ మీడియా మొత్తం నొస‌లు చిట్లించింది. టీవీ ఛాన‌ళ్ల విష‌యంలోనూ అంతే. రెండు మూడు ఛాన‌ళ్ల‌కు త‌ప్ప‌... బ‌న్నీ ఎవ్వ‌రికీ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేదు. వెబ్ సైట్ల గురించి అయితే ఇక చెప్ప‌క్క‌ర్లేద్దు. అస‌లు ప‌ట్టించుకొనే లేదు. అయితే యూ ట్యూబ్ లో మాత్రం తొలిసారి బ‌న్నీ ఏకంగా ఓ గంట లైవ్ ఇచ్చాడు. సోష‌ల్ మీడియాలో ప్ర‌మోష‌న్ల పై బ‌న్నీ ముందు నుంచీ ఫోక‌స్ పెడుతూనే ఉన్నాడు.

కాక‌పోతే ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా విష‌యంలో ఎప్పుడూ అశ్ర‌ద్ద చేయ‌లేదు. ప‌బ్లిసిటీ విష‌యంలో చాలా కేర్ తీసుకొనే బ‌న్నీ... ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నాడో అర్థం కావ‌డం లేదు. ఇలాగైతే.. ప్ర‌మోష‌న్లలో వీక్ అవుతాం.. అని దిల్ రాజు మొత్తుకొన్నా... అల్లు అర్జున్ విన‌డం లేద‌ని తెలుస్తోంది. బ‌న్నీ ప‌ర్స‌న‌ల్ పీఆర్వోలే... బ‌న్నీని మీడియాకు దూరం చేస్తున్నార‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ ఉదంతం త‌ర‌వాత బ‌న్నీ హ‌ర్ట్ అయ్యాడ‌ని, గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి వ‌ర‌కూ తెచ్చింది మీడియానే అని బ‌న్నీ ఫీల్ అవుతున్నాడ‌ని అందుకే బ‌న్నీనే మీడియాని దూరం పెడుతున్నాడ‌ని మ‌రో వ‌ర్గం అంటోంది. ఏదేమైనా మీడియాకి బ‌న్నీ మెల్లి మెల్లిగా దూరం అవుతున్నాడు. అది బ‌న్నీ రాబోయే సినిమాల‌కు అంత మంచిది కాదు. ఈ విష‌యాన్ని బ‌న్నీ ఎంత త్వ‌ర‌గా తెలుసుకొంటే అంత మంచిది.