English | Telugu
బాలు 35 ఏళ్లు దేశంమెచ్చే గాయకుడవుతారని ఆనాడే చెప్పిన కోదండపాణి!
Updated : Jun 30, 2021
మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ 1963లో జాతీయ స్థాయిలో నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొన్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అప్పుడాయన మద్రాసులో ఏఎంఐఈ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నారు. ఆ పోటీలకు జడ్జిలుగా సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఘంటసాల, పెండ్యాల నాగేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తి వ్యవహరించారు. ఆ పోటీలో అందరికంటే ముందు పాడింది బాలు. ఆ తర్వాత ఇంకా దాదాపు 100 మంది పాడాల్సిన వాళ్లున్నారు. ఫలితాలు మూడవరోజుకు కానీ తెలియవు. ఇంతలో ప్రేక్షకుల్లోంచి ఓ పొట్టివ్యక్తి బాలు దగ్గరకు వచ్చి, "బాగా పాడావు. నువ్వు పాడే పద్ధతి నాకు నచ్చింది. సినిమాల్లో పాడిస్తాను. పాడతావా?" అనడిగారు.
ఏం చెప్పాలో బాలుకు తోచలేదు. "మీరెవరు సార్?" అనడిగారు. "నాపేరు కోదండపాణి" అన్నారాయన. అదే కోదండపాణితో బాలు తొలిపరిచయం. ఆ పరిచయం తన జీవితాన్ని ఓ గొప్ప మలుపు తిప్పుతుందని ఆయనకప్పుడు తెలీదు. ఆ మరుసటిరోజు బాలును నిర్మాత భావనారాయణ ఆఫీసుకు తీసుకెళ్లారు కోదండపాణి. ఆయన ముందు పాడారు బాలు. "బాగా పాడుతున్నాడ్రా. కానీ గొంతు మరీ లేతగా ఉంది. అటు చిన్నపిల్లలకూ పాడించలేం, ఇటు హీరోలకూ పాడించలేం. కాస్త గొంతు ముదరనీ.. చూద్దాం" అన్నారు భావనారాయణ. నిరుత్సాహంతో తిరిగి వెళ్లిపోయారు బాలు.
అప్పటికి సంగీతానికి కామా పెట్టి, చదువుమీద దృష్టి కేంద్రీకరించారు. రెండేళ్ల పాటు మళ్లీ సినీ పరిశ్రమవైపు ఆయన కన్నెత్తి చూడలేదు. 1966లో బాలును వెతుక్కుంటూ ఓ వ్యక్తి కాలేజీకి వచ్చారు. కోడండపాణిగారు పంపించారనీ, వెంటనే పిలుచుకు రమ్మన్నారనీ ఆ మనిషి చెప్పాడు. ఆయనతో పాటు హాస్యనటులు పద్మనాభం ఆఫీసుకు వెళ్లారు బాలు. పద్మనాభం ముందు పాడి వినిపించారు. అలా కోదండపాణి సంగీత సారథ్యంలో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967) చిత్రంతో గాయకుడిగా పరిచయమయ్యారు బాలు. ఆ తర్వాత కథంతా మనకు తెలిసిందే.
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక కొత్తగాయకుడికి అవకాశమిచ్చిన తర్వాత, సాధ్యమైనంత వరకూ ఆ సంగీత దర్శకుడి సినిమాల్లో చిన్నా చితకా అవకాశాలు ఇస్తుంటారు. కాలం కలిసి రాకపోతే ఆ గాయకుడి కథ అక్కడే ముగుస్తుంది. గాయకుడిగా బాలు భవిష్యత్తు మీద ఆయన తల్లితండ్రులకే అంత నమ్మకం లేదు. కానీ కోదండపాణికి బాలు మీద ఎంత నమ్మకం అంటే, మొదటి పాట పాడినప్పట్నుంచీ బాలు భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకున్నారు. "ఇంకా 35 సంవత్సరాలు దేశంమెచ్చే గాయకుడిగా ప్రసిద్ధి పొందుతావు. అందుకు నీ ప్రయత్నమూ చాలా కావాలి. చాలా నిష్ఠగా కృషిచేయాలి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రోజూ సాధన చేయాలి." అని నూరిపోసేశారు.
అంతేకాదు, బాలు పాటను విజయా గార్డెన్స్‌లోని టేపులో దాదాపు సంవత్సరం పాటు చెరపకుండా ఉంచి ప్రతి సంగీత దర్శకుడికీ వినిపిస్తూ వచ్చారు. అవకాశం ఇవ్వమని వాళ్లను అభ్యర్థించేవారు కోదండపాణి. బాలు ఆర్థిక పరిస్థితి గమనించి తన దగ్గరే సహాయకుడిగా ఉద్యోగం ఇచ్చి జీతమిప్పించారు. బాలు పరోక్షంలో "నా కోడిపుంజుకి 35 సంవత్సరాలు తిరుగులేదు." అని చెప్పేవారు. అంతగా బాలు గురించి శ్రద్ధ తీసుకున్నారు కోదండపాణి. తనపై గురువు పెట్టుకున్న నమ్మకాన్ని బాలు వమ్ము చేయలేదు. గురువు చెప్పినట్లు 35 కాదు.. ఇంకో పదేళ్లు ఎక్కువగానే తిరుగులేని విధంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర రంగాలను తన గానామృతంలో ఓలలాడించారు బాలు. అలా గురుదక్షిణను చెల్లించుకున్నారు ఆ గానగంధర్వుడు.