English | Telugu
పిల్లల్లో చిరంజీవి క్రేజ్ చూసి భయపడ్డ కె. విశ్వనాథ్!
Updated : Jun 30, 2021
చిరంజీవి హీరోగా కె. విశ్వనాథ్ రూపొందించిన 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' చిత్రాలు క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. తన మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన ఆ పాత్రల్లో మెగాస్టార్ సూపర్బ్‌గా రాణించారు. "చిరంజీవి ఇమేజ్, ప్రజల్లో ఆయనకున్న విపరీతమైన ఫాలోయింగ్ ఒక్కోసారి నన్ను భయపెడుతూ ఉంటాయి. ఆయన ఇమేజ్‌కు, ఫాలోయింగ్‌కు తగ్గ కథ మనం తయారుచేయగలమా అనే డౌట్ వస్తుంటుంది." అని 'ఆపద్బాంధవుడు' సినిమా చేయడానికి ముందు ఒకసారి చెప్పారు కె. విశ్వనాథ్. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తను చూసిన ఓ సంఘటనను ఆయన వివరించారు.
అప్పట్లో ఆయన మద్రాస్‌లో నివాసం ఉండేవారు. హైదరాబాద్‌లో షూటింగ్ ఉంటే, ఇక్కడకు వచ్చి హోటల్‌లో బస చేసేవారు. ఒకరోజు సాయంత్రం హోటల్‌లో బోర్‌కొట్టి, అలా రూమ్ బయటకు వచ్చి రెస్టారెంట్‌లో ఓ మూలగా కూర్చున్నారు విశ్వనాథ్. ఆయనకు బాగా కనిపించేటట్లు ఉన్న టేబుల్ దగ్గర ఓ ఫ్యామిలీ కూర్చొని ఉంది. మూడేళ్ల బాబు అమ్మానాన్నలతో కూర్చొని బాగా అల్లరి చేస్తున్నాడు. టిఫిన్ చెయ్యకుండా ప్లేటుపై కెలుకుతూ అల్లరి చెయ్యడం చూసి, వాళ్లమ్మ ఒక్క దెబ్బ వేసింది. దాంతో ఉక్రోషంతో, "ఇదో.. నేను చిరంజీవి అంకుల్‌తో చెప్తా." అన్నాడు బెదిరింపుగా.
కోపం స్థానంలో ఆవిడ ముఖంలో నవ్వు వచ్చేసింది. "చెప్పుకో నాకేం భయం" అంది. వాడు, "చిరంజీవి అంకుల్ గుర్రంమీద వచ్చి నిన్ను డిష్షుం డిష్షుం అని తంతాడు జాగ్రత్త మరీ" అన్నాడు మళ్లీ బెదిరిస్తూ. ఆవిడ, "నన్నెందుకు తంతాడు. నువ్వు బుద్ధిగా అమ్మచెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తున్నావని నిన్నే తంతాడు." అని చెప్పింది.
దాంతో ఆ బుడ్డాడు ఆలోచనలో పడ్డాడు. వాడి మౌనం చూసి, "చిరంజీవి అంకుల్‌కి అల్లరి పిల్లలు అంటే ఇష్టం ఉండదు. చక్కగా, బుద్ధిగా తింటూ బాగా చదువుకునే పిల్లలంటేనే ఇష్టం." అని చెప్పింది వాళ్లమ్మ. అప్పుడు వాళ్ల నాన్న కూడా అందుకున్నాడు.. "చిరంజీవి అంకుల్ నీ అంత చిన్నగా ఉన్నప్పుడు ఎంతో బుద్ధిగా ఉండేవాడు. మరి నువ్వు పెద్దయితే చిరంజీవి అంకుల్‌లా అవుతానంటావుగా. చిన్నప్పుడు చిరంజీవి అంకుల్ ఉన్నట్టు నువ్వుండాలి." అని చెప్పాడు. దాంతో వాడు సరేనని తలూపి టిఫిన్ తినడం మొదలుపెట్టాడు.
కేవలం తెరమీద చిరంజీవిని చూసి నిత్యజీవితంలో తనకెంతో దగ్గరివాడు, ఆత్మీయుడు అన్న ఫిలింగ్‌ను చిరంజీవి వాళ్లలో క్రియేట్ చేశాడని విశ్వనాథ్ అంటారు. "అది సామాన్యమైన విషయం కాదు. ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్న చిరంజీవి ఇమేజ్‌కు తగ్గ కథ తయారుచెయ్యాలని ప్రయత్నించినప్పుడల్లా నాకు ఆ సంఘటన గుర్తొచ్చి భయపెడుతూ ఉంటుంది." అని ఆ సందర్భంగా చెప్పారు.