English | Telugu
"శివశంకరీ" పాట వెనుక ఎంత కష్టముందో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు!
Updated : Jun 29, 2021
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు టైటిల్ రోల్ పోషించగా దిగ్దర్శకుడు కె.వి. రెడ్డి రూపొందించిన 'జగదేకవీరుని కథ' (1961) బాక్సాఫీస్ దగ్గర ఎంత బ్లాక్‌బస్టర్ హిట్టయిందో, ఆ సినిమాలో ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన "శివశంకరీ శివానందలహరి" పాట అంతగా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ఆ పాటను సాధనచేసి, కచేరీలో, పోటీలలో పాడేందుకు ఔత్సాహిక గాయకులు అమితోత్సాహం చూపిస్తుంటారంటే.. అది ఆ పాటకున్న మహత్తు. తెలుగు సినిమా సంగీత చరిత్రలో "శివశంకరీ" పాట ప్రస్తావన లేకపోతే అది అసంపూర్ణమవుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఈ పాట రూపొందడానకి వెనుక కూడా ఓ కథ ఉంది. దీనికి ముందు 'జగదేకవీరుని కథ'లోని మిగతా పాటల రికార్డింగ్, వాటి పిక్చరైజేషన్ కూడా అయిపోయింది. క్లైమాక్స్ షూటింగ్‌కు ఇంకో రెండు నెలల వ్యవధి ఉందనంగా డైరెక్టర్ కె.వి. రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావుతో ఈ పాట సందర్భాన్ని వివరించి, ఈ పాట సినిమా మొత్తానికీ ప్రాణం లాంటిదనీ, రాయిని కరిగించి మునికి శాపవిమోచనం కలిగించే ఆ పాటలో ఆ ఎఫెక్ట్ నిజమనిపించేట్లు కనిపించాలనీ చెప్పారు. కావాలనుకుంటే, ఈ సినిమాకు ఆధారమైన తమిళ చిత్రం 'జగదల ప్రతాపన్'ను ఓసారి చూడమనీ సలహా ఇచ్చారు.
కానీ ఒరిజినల్‌ను చూస్తే ఆ ప్రభావం తనమీద పడుతుందనే ఉద్దేశంతో పెండ్యాల ఆ సినిమా చూడలేదు. తర్వాత సాంగ్ సిట్టింగ్‌లో గీత రచయిత పింగళి నాగేంద్రరావు "శివశంకరీ శివానందలహరి" అనే పల్లవిని రాసుకొచ్చి వినిపించారు. అది బాగుందని కె.వి. రెడ్డి ఓకే చేశారు. ఆ పల్లవిని పలు రాగాల్లో పాడి వినిపించారు పెండ్యాల. దర్బారీ రాగంలో చేసిన ట్యూన్ వారికి నచ్చింది.
మరుసటి రోజు మిగతా పాటనంతా రాసుకొచ్చి ఇచ్చారు పింగళి. దాన్ని తీసుకొని ఇంటికెళ్లారు పెండ్యాల. ఏకధాటిగా పదిహేను రోజులు శ్రమించి, ఆ పాటకు బాణీలు కట్టారు. పాట సిద్ధమైందని కె.వి. రెడ్డికి చెప్పారు. తర్వాత రోజు అందరూ కూర్చున్నారు. పెండ్యాల పాట మొత్తం ఆలపించారు. అంతా నిశ్శబ్దంగా విన్నారు. పాట అద్భుతంగా ఉంది. కానీ "టైమ్ చూశారా.. పదమూడు నిమిషాలు వచ్చింది. అంతసేపు తెరమీద ఆ పాటను చూపించడమంటే చాలా కష్టం. ప్రేక్షకులు కూడా ఇబ్బంది ఫీలవుతారు. సగానికి తగ్గించండి." అని సూచించారు కె.వి. రెడ్డి.
దాంతో మరో నాలుగైదు రోజులు కష్టపడి, కుదించి మళ్లీ వినిపించారు పెండ్యాల. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కె.వి. రెడ్డి. ఆ పాటను బాగా రిహార్సల్స్ చేసి, తనకే సాధ్యమైన రీతిలో అత్యద్భుతంగా పాడారు ఘంటసాల. ఆ పాటను హిందుస్తానీ విద్వాంసుల తరహాలో విన్యాసాలు ప్రదర్శిస్తూ తెరమీద అంతే గొప్పగా అభినయించారు ఎన్టీఆర్. పాట మొత్తంలో ఎక్కడా ఒక్కసారి కూడా తడబాటు లేకుండా, పాట మొత్తానికి సింక్ అయ్యేలా లిప్ మూవ్‌మెంట్ ఇస్తూ ఆయన నటించిన విధానానికి సెట్స్ మీదున్న యూనిట్ మెంబర్స్ అంతా తమను తాము మరచిపోయి చూశారు. అందరూ అంత శ్రమపడ్డ ఆ పాటకు దానికి తగిన అద్భుత ఫలితాన్నిచ్చింది. తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో మకుటాయమానమైన పాటగా నిలిచిపోయింది.