English | Telugu

ఆ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చెయ్యలేరు.. ఇది హాస్యబ్రహ్మ జంధ్యాలకు మాత్రమే వర్తిస్తుంది!

‘ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు’, ‘ఆయన స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చెయ్యలేరు’.. ఎవరైనా సినీ ప్రముఖులు చనిపోయినపుడు వారికి నివాళులు అర్పించే క్రమంలో కొందరు ప్రముఖులు మాట్లాడే మాటలు. చనిపోయిన ఆ కళాకారుడికి ఆ మాటలు వర్తిస్తాయా లేదా అన్నది పక్కన పెడితే.. ఒక వ్యక్తికి మాత్రం ఆ మాటలు నూటికి నూరు శాతం వర్తిస్తాయి. ఆయనే హాస్యబ్రహ్మ జంధ్యాల. ‘నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అనేది జంధ్యాల మార్క్‌ స్లోగన్‌. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన హాస్యాన్ని నూటికి నూరు శాతం అందించారు. కమర్షియల్‌ సినిమాలు, మాస్‌ సినిమాలు, యాక్షన్‌ సినిమాల ఒరవడిలో తెలుగు సినిమా కొట్టుకుపోతున్న తరుణంలో తెలుగు ప్రేక్షకులకు చక్కని హాస్యాన్ని పరిచయం చేశారు జంధ్యాల.  అప్పటివరకు సినిమాల్లో ట్రాక్‌గా మాత్రమే ఉన్న హాస్యాన్ని మెయిన్‌ ట్రాక్‌లోకి తెచ్చిన ఘనత జంధ్యాలదే. కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూయించిన జంధ్యాల వర్థంతి జూన్‌ 19న. ఈ సందర్భారాన్ని పురస్కరించుకొని ఆ హాస్యబ్రహ్మను స్మరించుకోవడం తెలుగు వారందరి బాధ్యత. 

చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ పెంచుకున్న జంధ్యాల ఎన్నో నాటకాలు రచించారు. నాటక రంగంలో నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 1976లో విడుదలైన ‘దేవుడు చేసిన బొమ్మలు’ సంభాషణల రచయితగా జంధ్యాల మొదటి సినిమా. 1976లోనే కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రానికి మాటలు రాశారు. ఆ సినిమా పెద్ద హిట్‌ అవ్వడంతో రచయితగా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం 1977లో ‘అడవి రాముడు’ వంటి భారీ కమర్షియల్‌ సినిమా ఆయన్ని రచయిత తారాస్థాయిలో నిలబెట్టింది. ఆ తర్వాత వరసగా ‘వేటగాడు’, ‘డ్రైవర్‌ రాముడు’ వంటి సిల్వర్‌ జూబ్లీ సినిమాలకు మాటలు అందించారు. 1980లో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా జంధ్యాలకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. 

1976 నుంచి 1981 వరకు అంటే ఐదేళ్ళలో దాదాపు 200 సినిమాలకు మాటలు రాశారంటే ఆయనకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో అర్థం చేసుకోవచ్చు. 1981లో ‘ముద్ద మందారం’ చిత్రం దర్శకుడిగా మారి దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు జంధ్యాల. దర్శకుడిగా కొనసాగుతూనే ఇతర దర్శకులు చేసే సినిమాలకు మాటలు రాశారు. ఆయన మాటలు రాసిన సినిమాలు ఎక్కువ శాతం ఘనవిజయం సాధించినవే. వాటిలో సీతాకోక చిలుక, సాగరసంగమం, పసివాడి ప్రాణం, జగదేక వీరుడు అతిలోక సుందరి, అబ్బాయిగారు, ఆదిత్య 369, స్వాతికిరణం వంటి సినిమాలు ఉన్నాయి.

‘ముద్ద మందారం’ చిత్రంతో దర్శకుడిగా తన పంథా ఏమిటో ప్రేక్షకులకు రుచి చూపించారు జంధ్యాల. తను దర్శకత్వం వహించే సినిమాలో కథ ఏదైనా దానిలో హాస్యాన్ని జొప్పించి ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూయించేవారు జంధ్యాల. జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవ్వకముందు సినిమాల్లో హాస్యం అనేది ఒక విభాగంలా ఉండేది. కథ ఏదైనా దానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా కామెడీ ట్రాక్‌ను పెట్టేవారు. అయితే కామెడీనే మెయిన్‌గా చేస్తూ ఎన్నో హాస్య చిత్రాలు రూపొందించారు జంధ్యాల. వాటిలో శ్రీవారికి ప్రేమలేఖ, రెండు జెళ్ళ సీత, నాలుగు స్తంభాలాట, రెండు రెళ్ళు ఆరు, శ్రీవారి శోభనం, చంటబ్బాయ్‌, అహనా పెళ్ళంట వంటి పూర్తి స్థాయి హాస్య చిత్రాలు జంధ్యాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

హాస్య చిత్రాలే కాకుండా ఆనందభైరవి, అమరజీవి, సీతారామకళ్యాణం, పడమటి సంధ్యారాగం, పుత్తడిబొమ్మ వంటి వైవిధ్యభరిత చిత్రాలను కూడా రూపొందించారు జంధ్యాల. తన సినిమాల ద్వారా ఎందరో హాస్య నటులను పరిచయం చేసి తన సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్‌ ఇవ్వడం ద్వారా వారి ఎదుగుదలకు తోడ్పడ్డారు. ఇప్పుడు ప్రముఖ దర్శకులుగా పేరు తెచ్చుకుంటున్న ఎంతో మంది డైరెక్టర్లకు స్ఫూర్తి జంధ్యాల. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జంధ్యాల వర్థంతి జూన్‌ 19. ఈ సందర్భంగా తన సినిమాలతో ఆబాల గోపాలాన్ని నవ్వుల్లో ముంచెత్తిన జంధ్యాలకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.