English | Telugu
కలియుగ దైవంగా దర్శనమిచ్చిన ఎన్టీఆర్.. భక్తి పారవశ్యంతో కానుకలు సమర్పించిన ప్రేక్షకులు!
Updated : Jun 19, 2024
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా మన హిందూ దేవుళ్ళు ఏయే రూపాల్లో ఉంటారో ఎవరికీ తెలీదు. మన పూర్వీకులు చిత్రించిన రూపాల్లోనే ఉంటారని భావిస్తాం. సినిమా అనే మాధ్యమం రాకముందు చిత్రకారులు ఊహా చిత్రాలుగా వేసిన రూపాలనే దేవుళ్ళుగా కొలిచేవారు. సినిమా అనేది ప్రారంభమైన తర్వాత ఆ ఊహా చిత్రాలకు అనుగుణంగా నటుల్ని కూడా దేవుళ్ళుగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు. మన సినిమాల్లో దేవుళ్ళ పాత్రలను ఎంతో మంది నటులు పోషించినా ఆయా దేవుళ్ళకు జీవం పోసింది మాత్రం నటరత్న నందమూరి తారకరామారావు. ఏ దేవుడి పాత్ర పోషించినా నిజంగా దేవుడనేవాడు ఇలాగే ఉంటాడా అన్నంతగా ఆయన ఆయా పాత్రల్లో ఒదిగిపోయేవారు.
సినిమాల్లో దేవుళ్ళను చూపించడం ప్రారంభమైన తర్వాత శ్రీరాముడంటే ఎన్టీఆర్, శ్రీకృష్ణుడంటే ఎన్టీఆర్.. ఇలా ఏ దేవుడైనా ఆయన రూపంలోనే ఉంటాడనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. అందుకే పాతరోజుల్లో ఏదైనా పురాణ ఇతిహాసంతో కూడిన సినిమా వచ్చిందంటే.. అందులో ఎన్టీఆర్ పోషించిన దేవుడి పాత్రకు నీరాజనాలు అర్పించేవారు. కొన్ని సందర్భాల్లో థియేటర్‌లోని స్క్రీన్ ముందు హారతి ఇవ్వడం, కొబ్బరి కాయలు కొట్టడం వంటివి కూడా చేసేవారు. దీన్నిబట్టి తన రూపంతో ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని ఎంత మంత్రముగ్ధుల్ని చేసేవారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఓ అద్భుతమైన విషయం ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’ సినిమాకి జరిగింది.
నందమూరి తారక రామారావు తొలిసారిగా వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించిన సినిమా ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’. 1960లో విడుదలైన ఈ సినిమాకి పి.పుల్లయ్య దర్శకుడు. ఆరోజుల్లో ఈ సినిమాను ప్రదర్శించిన థియేటర్లు దేవాలయాలుగా మారిపోయాయంటే ఇప్పటివారికి ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి థియేటర్‌లోనూ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో సినిమాకి వచ్చే ప్రేక్షకులు దేవాలయానికి వచ్చినంత భక్తిశ్రద్ధలు చూపేవారు. అక్కడ ఉంచిన హుండీలో కానుకలు వేసేవారు. కొన్ని చోట్ల తలనీలాలు సమర్పించిన సంఘటనలు కూడా చోటుచేసుకోవడం విశేషం.
దర్శకుడు పి.పుల్లయ్య 1939లోనే ‘వేంకటేశ్వర మహత్మ్యం’ చిత్రాన్ని రూపొందించి ఘనవిజయం సాధించారు. ముంబాయిలో ఈ సినిమా ఫిల్మ్ ఉంచిన ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల నెగెటివ్ పూర్తిగా కాలిపోవడంతో ఈతరం ప్రేక్షకులకు తొలి వేంకటేశ్వర మహత్మ్యం సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ ఆయన డైరెక్షన్‌లోనే 1957లో ఈ సినిమా ప్రారంభమైంది. పది లక్షల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం రెండేళ్ళపాటు జరిగింది. అన్నామలై, మామండూరు, ఊటీ, మద్రాసు, తిరుపతిలలో షూటింగ్ జరిపారు.
ఈ సినిమా కోసం వాహిని స్టూడియోలో తిరుమల ఆలయం సెట్ వేశారు. ఈ ఆలయంలో శ్రీవారికి నిత్యపూజలు జరిగేవి. ఈ సెట్‌లోనే చిత్రీకరించిన ‘శేష శైలా వాస శ్రీ వేంకటేశ’ పాటలో ప్రముఖ గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు నటించి అభిమానులను పరవశింపచేశారు. స్వతహాగా వేంకటేశ్వరస్వామి భక్తుడైన ఘంటసాల ఈ పాటలో నటించడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావించారు. సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా వాహిని స్టూడియోలో ఆలయం సెట్‌ను అలాగే ఉంచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షూటింగులను చూసేందుకు వాహిని స్టూడియోకి వచ్చేవారంతా అక్కడ ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించుకునేవారు. అలా ఆ హుండీకి రూ.46 వేలు వచ్చాయి. దానికి మరో నాలుగువేలు చేర్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు దర్శకుడు పుల్లయ్య. ఆ డబ్బుతో తిరుమలకు వచ్చే భక్తుల కోసం వసతి ఏర్పాట్లు చేయాలని కోరారు.
1960 జనవరి 9న విడుదలైన ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూస్తూ తెలుగు ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. 16 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ప్రదర్శితమైంది. విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ సినిమాను 25 వారాలు ప్రదర్శించారు. ఇదే సినిమాను తమిళ్‌లో ‘వేంకటేశ్వర కళ్యాణం’ పేరుతో, హిందీలో ‘భగవాన్ బాలాజీ’ పేరుతో అనువదించారు. అక్కడ కూడా ఘనవిజయం సాధించిందీ సినిమా. ఈ సినిమా తర్వాత వేంకటేశ్వరస్వామి మహిమల నేపథ్యంతో ఎన్నో సినిమాలు వచ్చినా 1960లో వచ్చిన ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’ చిత్రానికే ప్రేక్షకులు నీరాజనాలు అర్పించారు.