English | Telugu
రెండు సార్లు రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమా.. రెండు నెలలు బ్యాన్ అయింది!
Updated : Jun 18, 2024
నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెరంగేట్రం చేసి 50 సంవత్సరాలుగా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తొలి సినిమా ‘తాతమ్మకల’. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణతోపాటు నందమూరి హరికృష్ణ కూడా నటించారు. బాలకృష్ణకు నటనపట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ఎన్టీఆర్ అతనికి తగిన క్యారెక్టర్‌ను ‘తాతమ్మకల’ చిత్రంలో క్రియేట్ చేశారు. ఈ సినిమాలో తాతమ్మగా భానుమతి నటించారు. 1974 ఆగస్ట్ 29న ఈ సినిమా విడుదలైంది. కొన్ని వివాదాస్పద అంశాలను సినిమాలో చూపిస్తే అది వివాదంగా మారడం, సెన్సార్ సమస్యలు రావడం సాధారణంగా జరుగుతుంటాయి. సెన్సార్ వారు చేసిన సూచనలకు అనుగుణంగా సినిమాలో మార్పులు చేసుకుంటారు దర్శకనిర్మాతలు. కానీ, ఒక సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత అందులో చూపించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, ఆ సినిమాను నిషేధించడం ఎప్పుడైనా చూశామా? అది ‘తాతమ్మకల’ చిత్రం విషయంలో జరిగింది.
కుటుంబ నియంత్రణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్న రోజుల్లో ‘తాతమ్మకల’ చిత్రం విడుదలైంది. ఇందులో కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ భానుమతితో డైలాగులు చెప్పించారు ఎన్టీఆర్. అలాగే భూ సంస్కరణలను కూడా వ్యతిరేకిస్తూ ఈ సినిమాలో ప్రభుత్వ విధానాలను విమర్శించారు. సినిమా విడుదలయ్యాక అసెంబ్లీలో ఈ అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. ఫలితంగా ‘తాతమ్మకల’ చిత్రాన్ని రెండు నెలలు నిషేధించారు. సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత నిషేధించడం విశేషం. ఆ సమయంలో ఎన్టీఆర్ దానికి వివరణ ఇస్తూ.. భూసంస్కరణలకు, కుటుంబ నియంత్రణకు తాను వ్యతిరేకం కాదని, దేశంలోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే అవి అవసరం లేదు అనేది తన అభిప్రాయమని చెప్పారు.
రెండు నెలలు నిషేధించిన తర్వాత దినపత్రికలో ‘తాతమ్మకల’ 50వ రోజు ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనలో తమ సినిమాను మరొక విధంగా రూపొందించాలన్న ఆలోచనతో చిత్ర ప్రదర్శన నిలిపివేస్తున్నామని, త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. కొన్ని మార్పులు చేసి 1975, జనవరి 8న సినిమాని మళ్ళీ విడుదల చేశారు. మొదటిసారి బ్లాక్ అండ్ వైట్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాను రెండోసారి విడుదల చేసినపుడు పాటలను కలర్‌లో చిత్రీకరించారు. తాతమ్మ భర్త సన్యాసుల్లో కలిసిపోయినట్టు మొదటిసారి చూపించి రెండోసారి ఆయన తిరిగి ఇంటికి వచ్చినట్టు చూపించారు. మొదట బాలకృష్ణకు పి.సుశీల ప్లేబ్యాక్ పాడగా, రెండోసారి మాధవపెద్ది రమేష్ పాడారు.