English | Telugu
బ్యాచిలర్ కష్టాలు కంటిన్యూస్!
Updated : Apr 21, 2021
2020 వేసవి నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి నానా తంటాలు పడుతూనే ఉన్నాడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదట ఈ మూవీని గత ఏడాది వేసవిలో శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో దసరాకు విడుదల చేయాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్ అనంతరం కూడా షూటింగ్‌లకు అనుకూల వాతావరణం లేకపోవడంతో విడుదలను 2021 జనవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్ చివరలో షూటింగ్ పునఃప్రారంభించారు. జనవరికి సినిమాని తీసుకు రావడం కష్టమని అర్థమవడంతో ఏప్రిల్‌లో తెద్దామనుకున్నారు. కానీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ జూన్ 19న సినిమాని విడుదల చేస్తున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించారు. అంటే 2020 ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకున్న సినిమాని 14 నెలల తర్వాత రిలీజ్ చేయాలని సంకల్పించారు.
కానీ ఇప్పుడు జూన్ 19న కూడా సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ బీభత్సంగా ఉండటంతో ఈ నెలలో, వచ్చే నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలను పోస్ట్‌పోన్ చేస్తున్న సందర్భం చూస్తున్నాం. దానికి అనుగుణంగానే జూన్‌లో రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా పోస్ట్‌పోన్ అవ్వక తప్పదని తెలుస్తోంది. దీంతో మరోసారి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ డేట్ మారుతుందనేది ఖాయమంటున్నారు.
ఇంతదాకా మూడు సినిమాలు రిలీజైన గెలుపు రుచి ఎలా ఉంటుందో చూడని, అఖిల్‌కు నాలుగో సినిమా అయినా ఆ రుచి అందిస్తుందని అనుకుంటూ ఉంటే.. పలుసార్లు విడుదల వాయిదా పడుతూ నిరాశ పరుస్తోంది. నిజానికి డిసెంబర్ నాటికి షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసి, మార్చిలోగా ఎందుకు రిలీజ్ చేసి ఉండకూడదని నిర్మాతలపై గుస్సా అవుతున్నారు ఫ్యాన్స్. నాలుగు నెలల కాలంలో ఎన్నో సినిమాలు రిలీజై, వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్ కూడా అయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా అఖిల్‌కు కాలం కలిసి రావట్లేదన్న మాటే!