English | Telugu
గుత్తా జ్వాల, విష్ణు విశాల్ పెళ్లయింది!
Updated : Apr 22, 2021
హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ స్టార్ యాక్టర్ విష్ణు విశాల్ జీవిత భాగస్వాములుగా మారారు. చెన్నైలో కన్నుల పండువగా అతికొద్ది మంది సన్నిహితుల మధ్య గురువారం జరిగిన వేడుకలో ఆ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. జ్వాల సంప్రదాయ పట్టుచీర ధరించగా, విష్ణు విశాల్ ధోతి, షర్టు వేసుకున్నాడు. జ్వాల ఒంటి నిండా ఆభరణాలతో మెరిసిపోయింది. జ్వాల తండ్రి తెలుగు వ్యక్తి కాగా, తల్లి చైనీస్. రెడ్ బోర్డర్ ఉన్న లైట్ బ్లూ సిల్క్ శారీ, మెడలో హెవీ నెక్లెస్, తలకు పట్టి, ముక్కుకు పెద్ద రింగు, చెవులకు దుద్దులు పెట్టుకొని బ్యూటిఫుల్‌గా కనిపించింది.
ఆ ఇద్దరూ దండలు మార్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ చాలా సరదాగా, ఆనందంగా కనిపించారు. జ్వాల అయితే అల్లరి కూడా చేసిందని వీడియో తెలియజేస్తోంది. ఆ ఇద్దరూ తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకుంటున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఇద్దరి చుట్టూ ఓ ఇరవై మంది దాకా అతిథులు ఉన్నారు. ఫంక్షన్‌కు వచ్చే ముందు వారంతా కొవిడ్ టెస్ట్ చేయించుకొని రిజల్ట్ నెగటివ్ అని తేలాకే వెళ్లారు.
కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న జ్వాల, విష్ణు విశాల్ రెండేళ్ల క్రితం తమ అనుబంధం గురించి సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఇప్పుడు తాము ఈ నెల 22న మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో వెడ్డింగ్ కార్డ్ పిక్చర్‌ను పోస్ట్ చేసిన విష్ణు విశాల్, దానికి #JwalaVished అనే హ్యాష్‌ట్యాగ్ జోడించాడు. "జీవితం ఒక ప్రయాణం ... దాన్ని ఆలింగనం చేసుకోవాలి ... విశ్వాసం కలిగి అందులో దూకాలి ... ఎప్పట్లాగే మీ ప్రేమ, మద్దతు కావాలి." అని రాసుకొచ్చాడు.
ఈ వెడ్డింగ్ కార్డును జ్వాల కూడా షేర్ చేసింది. అందులో, "మా కుటుంబాల ఆశీర్వాదంతో, సన్నిహితుల-ప్రియమైన వారి సమక్షంలో ఓ ప్రైవేట్ వ్యవహారంగా మా మ్యారేజ్ జరగబోతున్నదనే న్యూస్ పంచుకోవడం మాకు చాలా ఆనందాన్నిస్తోంది. మేం పెళ్లి చేసుకుంటున్నాం. ఇన్నేళ్లుగా మాపై మీరు కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు థాంక్స్. ప్రేమ, విధేయత, స్నేహం, కలయిక అనే జర్నీని ప్రారంభిస్తున్న మాకు మీ ఆశీర్వాదాలు కావాలి." అని ఉంది.
గుత్తా జ్వాల, విష్ణు విశాల్ ఇద్దరికీ ఇది సెకండ్ మ్యారేజ్. జ్వాల ఇదివరకు సహ ఆటగాడు చేతన్ ఆనంద్‌ను పెళ్లి చేసుకొని, 2011లో విడిపోగా, విష్ణు విశాల్ సైతం రజిని నటరాజ్‌తో వైవాహిక బంధాన్ని 2018లో తెంచేసుకున్నాడు. విష్ణుకు రజిని ద్వారా ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు.