English | Telugu

హీరోగా ఫ‌స్ట్ ఫిల్మ్ ఫ్లాప్.. జంషెడ్‌పూర్‌లో ఉద్యోగానికి వెళ్లిపోయిన ఎస్వీఆర్‌!

 

ఆర్టిస్ట్ కావాల‌ని మ‌ద్రాస్ వెళ్లారు ఎస్వీ రంగారావు. తేనాంపేట‌లోని ఎల్డామ్స్ రోడ్ చివ‌ర‌న ఉన్న ఓ ప్రెస్‌లో కింద పేప‌ర్లు వేసుకొని ప‌డుకొని క‌ల‌లు కంటూ వ‌చ్చారు. ఆ క‌ల‌లు క‌ల్ల‌ల‌వుతాయేమోన‌ని నిరాశ‌ప‌డ్డ రోజులున్నాయి. ఈ జీవితం ఇంతేనా అని కృంగిపోయిన సంద‌ర్భాలున్నాయి. తిన‌డానికి తిండి లేక ప‌స్తులుండి మంచినీళ్లు మాత్ర‌మే తాగి బ‌తికిన రోజులున్నాయి. ఈ బాధ‌లు ప‌డ‌లేక ఇంటికి వెళ్లిపోదామ‌ని రెడీ అయితే, ఆ త‌ర్వాత కాలంలో 'తాత మ‌న‌వ‌డు' లాంటి సినిమాలు తీసిన నిర్మాత కె. రాఘ‌వ వారించారు. ఎస్వీఆర్‌తో పాటు ఆయ‌నా సినీ రంగంలో ఏదో ఒక ఉపాధి చూసుకోవాల‌ని వ‌చ్చిన‌వారే. ఇద్ద‌రికి ఇద్ద‌రూ తోడ‌య్యారు.

ఎస్వీఆర్‌కు నాట‌కాల ద్వారా కాకినాడ‌లో ప‌రిచ‌యం ఉన్న అంజ‌లీదేవి వాళ్ల బాధ‌లు చూసి, త‌న ఇంట్లోని అయ్య‌ర్‌కు చెప్పి, వాళ్లెప్పుడు భోజ‌నానికి వ‌చ్చినా లేద‌న‌కుండా పెట్ట‌మ‌ని పుర‌మాయించారు. అయినా అస్త‌మానూ అక్క‌డ‌కు ఏం వెళ్తారు! ఎలాగైతేనేం ఎస్వీఆర్ హీరో అయ్యారు. కానీ ఆయ‌న హీరోగా న‌టించిన ఆ సినిమా 'వ‌రూధిని' (1946) ఫ్లాప‌య్యింది. దాంతో లైఫ్ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. సినిమాలకు వేషాలు వెదుక్కుంటున్న‌ప్పుడు ప‌రిస్థితి వేరుగా ఉంటుంది కానీ, మొద‌టి సినిమాయే ఫ్లాపైతే ఆ ప‌రిస్థితి దారుణంగా ఉంటుంది. బాధ‌, అవ‌మానం.. రెండూ మ‌న‌సును మెలిపెడుతుంటాయి.

ఆ టైమ్‌లో ఎస్వీఆర్ ఇంటికి వెళ్లిపోదామ‌ని నిర్ణ‌యించేసుకున్నారు. అప్పుడే ఊళ్లోని పెద్ద‌వాళ్లు కూడా పెళ్లి చేసుకోమ‌న్నారు. ఆయ‌న మేన‌కొడ‌లినిచ్చి పెళ్లి చేసేశారు. సంసార బాధ్య‌త కూడా మీద ప‌డ‌టంతో జంషెడ్‌పూర్‌లో ఉద్యోగం చేయ‌డానికి వెళ్లిపోయారు. ఆయ‌న అక్క‌డ ఉండ‌గానే డైరెక్ట‌ర్ బి.ఎ. సుబ్బారావు నుంచి పిలుపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత నాలుగైదు సినిమాలు చేశాక 1951లో వ‌చ్చిన 'పాతాళ‌భైర‌వి'లో చేసిన నేపాళ మాంత్రికుడి పాత్ర‌తో తారాజువ్వ‌లా పైకెగ‌శారు ఎస్వీఆర్‌. అది ఆయ‌న న‌టించగా విడుద‌లైన ఏడ‌వ చిత్రం. ఆ త‌ర్వాత చ‌నిపోయేంత వ‌ర‌కు 1974లో వ‌చ్చిన చివ‌రి చిత్రం 'ద‌క్ష య‌జ్ఞం' దాకా ఆయ‌న తిరుగులేని విశ్వ‌న‌ట చ‌క్ర‌వ‌ర్తిగా ప్ర‌కాశించారు.