English | Telugu
లక్ష్మణుడి పాత్ర ఇవ్వమని అడిగిన శోభన్‌బాబు.. ఎన్టీఆర్ ఏమన్నారంటే...
Updated : Jun 5, 2021
మహానటుడు నందమూరి తారకరామారావు ప్రధాన పాత్ర పోషించిన 'దైవబలం' (1959) చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు శోభన్‌బాబు. అందులో ఆయన గంధర్వకుమారుడిగా కొద్దిసేపు కనిపించే పాత్ర చేశారు. మూడంటే మూడు రోజుల్లో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా తర్వాత దాన్ని నిర్మించిన పొన్నలూరి బ్రదర్స్ 'మహామాయ' అనే సినిమాను శోభన్‌బాబు హీరోగా తీద్దామనుకున్నారు. కానీ 'దైవబలం' ఫ్లాపవడంతో ఆ సినిమా అటకెక్కింది.
దాని తర్వాత చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించిన 'భక్త శబరి' (1960) చిత్రంలో శబరి పాత్రధారి పండరీబాయి దగ్గరుండే కరుణ అనే మునికుమారుడిగా నటించారు శోభన్‌బాబు. ఆ మూవీలో రామలక్ష్మణులుగా హరనాథ్, రామకృష్ణ నటించారు. ఆ సమయంలో పుట్టిన తన కుమారుడికి ఆ సినిమాలో తను చేసిన పాత్ర పేరు "కరుణ" అని పెట్టుకున్నారు శోభన్. రెండు సినిమాలు చేసినా అవకాశాలు వాటంతటవి ఆయనకు రాలేదు. అప్పటి పెద్ద నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో పాటు పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలను ఆయన కలుస్తూ వచ్చారు.
1960లో ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వంలో 'సీతారామ కల్యాణం' చిత్రాన్ని ప్రారంభించారు. అందులో ఆయన రావణాసురుడి పాత్రను పోషిస్తున్నట్లు, శ్రీరామునిగా హరనాథ్‌ను ఎంపిక చేసినట్లు శోభన్‌కు తెలిసింది. తన అదృష్టం పరీక్షించుకుందామని ఎన్టీఆర్‌ను కలిశారు. అప్పటికే 'దైవబలం' సెట్‌లో కలిసుండటంతో శోభన్‌ను గుర్తుపట్టిన ఎన్టీఆర్ "రండి బ్రదర్" అని ఆహ్వానించారు. "ఏ వేషం వేస్తారు?" అని ఆయనే అడిగారు. శ్రీరాముని పాత్రకు హరనాథ్ ఎంపికై ఉన్నాడని తెలిసినందువల్లా, పైగా ఏదో వేషం ఆయనే ఇవ్వకుండా, ఏ వేషం వేస్తారని ఆయనే అడగడంతో, కంగారులో "లక్ష్మణుడి పాత్ర ఇవ్వండి సార్" అని అడిగేశారు శోభన్.
ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా "ఓకే బ్రదర్. మా సినిమాలో మీరే లక్ష్మణుడు" అని అభయమిచ్చేశారు. అలా 1961 జనవరిలో విడుదలైన 'సీతారామ కల్యాణం'లో లక్ష్మణుడిగా నటించారు శోభన్. చెప్పాలంటే ఆ సినిమాలో లక్ష్మణుని పాత్ర చిన్నదే. కానీ ఇతర నటుల కాంబినేషన్‌లో సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల 56 రోజుల పాటు ఆ సినిమాకు పనిచేయాల్సి వచ్చింది. ఆ సినిమా చేసిన వెంటనే 'భీష్మ' సినిమాలో పనిచేసే అవకాశం కూడా ఎన్టీఆర్ ఇచ్చారు. అందులో అర్జునుని వేషం వేశారు శోభన్. అలా కెరీర్ తొలినాళ్లలో నందమూరి తారకరామారావు ప్రోత్సహించడంతో నెమ్మదిగా నిలదొక్కుకొని 'వీరాభిమన్యు' (1965)గా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు తెలుగువారి అందాల నటుడు శోభన్‌బాబు.