English | Telugu
వియ్యంకుడు అక్కినేని హీరోగా డి. రామానాయుడు నిర్మించిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే!
Updated : Jun 6, 2021
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మూవీ మొఘల్ డి. రామానాయుడు వియ్యంకులనే విషయం తెలిసిందే. నాగార్జునకు, రామానాయుడు కుమార్తె లక్ష్మికి 1984లో వివాహం జరిగింది. కానీ అభిప్రాయ భేదాల కారణంగా ఆరేళ్లలోనే ఇద్దరూ విడిపోయారు. అయినప్పటికీ అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల మధ్య సన్నిహితత్వం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అప్పటికీ, ఇప్పటికీ రెండు కుటుంబాలూ ఒక్కటే అన్నంతగా మెలగుతూ వస్తున్నాయి. వియ్యంకులు కాకముందే ఏఎన్నార్ హీరోగా పలు చిత్రాలు నిర్మించారు రామానాయుడు. ఈ రోజు (జూన్ 6) రామానాయుడు జయంతి సందర్భంగా ఆ సినిమా విశేషాలు...
ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ 'సిపాయి చిన్నయ్య' (1969). ఇందులో అక్కినేని టైటిల్ రోల్ పోషించడంతో పాటు, జమీందార్ భాస్కర్‌గా కూడా నటించారు. అంటే డ్యూయల్ రోల్ అన్నమాట. విశేషమేమంటే ఈ సినిమా కంటే ముందు రామానాయుడు నిర్మించిన 'రాముడు-భీముడు' సినిమాలోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. అది వాళ్లిద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్ ఫిల్మ్. ఇలా ఇద్దరు టాప్ హీరోలతో నిర్మించిన తొలి చిత్రాల్లో వారిచేత డ్యూయల్ రోల్ చేయించిన అరుదైన రికార్డును రామానాయుడు సొంతం చేసుకున్నారు.
'సిపాయి చిన్నయ్య' చిత్రానికి జి.వి.ఆర్. శేషగిరిరావు దర్శకత్వం వహించారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఈ సినిమాని నిర్మించినప్పటికీ ఓపెనింగ్ సీన్స్‌తో పాటు, క్లైమాక్స్ సీన్లనూ, రెండు పాటల్నీ కలర్‌లో చిత్రీకరించారు. చిన్నయ్య పాత్రకు జోడీగా కె.ఆర్. విజయ, భాస్కర్ క్యారెక్టర్ సరసన నాయికగా భారతి నటించారు.
అప్పటికే పలు చిత్రాల్లో నటించి, మంచి డాన్సర్‌గా పాపులర్ అయిన ఎల్. విజయలక్ష్మి "ఒరే మావా.. ఏసుకోరా సుక్క" అనే ఆరుద్ర పాటకు డాన్స్ చేశారు. అది విశేషం కాదు. అదివరకే ఆమె పెళ్లి చేసుకొని, సినిమాల్లో నటించనంటూ మనీలా వెళ్లిపోయారు. ఆ టైమ్‌లో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు ఆమె మద్రాసు వచ్చారు. ఈ విషయం తెలిసి, ఆమెను తమ సినిమాలో ఓ పాటలో నటించమని రామానాయుడు కోరారు. ఆయన మీదున్న గౌరవంతో ఆ పాటకు డాన్స్ చేశారు విజయలక్ష్మి. సత్యనారాయణ కాంబినేషన్‌తో ఆ పాటను చిత్రీకరించారు.