English | Telugu
అరకులోయలో శ్రీదేవి కాళ్లమీదపడ్డ కుర్రాడు!
Updated : Jun 11, 2021
'ప్రేమకానుక' (1981) సినిమా ఔట్‌డోర్ షూటింగ్ నిమిత్తం అక్కినేని హీరో హీరోయిన్లు అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి సహా యూనిట్ మెంబర్స్ అరకులోయకు వెళ్లారు. వాళ్లు వస్తున్నారని తెలిసి అక్కడున్న జనమంతా వాళ్లను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. జనాన్ని కంట్రోల్ చేయడం కష్టసాధ్యంగా మారింది. అరకులోయంటే శ్రీదేవికి చాలా ఇష్టం. ఎటుచూసినా పచ్చగా కనిపించే ఆ చల్లటి వాతావరణంలో ఆమె ఎంతో ఆనందాన్ని పొందుతుంది. శ్రీదేవి కారులోంచి కాలు కిందకు పెట్టేసరికి జనసందోహం మరింత పెరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా జనాన్ని అదుపులో పెట్టలేకపోతున్నారు.
అంతమందిని చూసి శ్రీదేవి భయపడ్డారు. ఎలాగో తడబడే కాళ్లతో ఆ జనం మధ్య నడుచుకుంటూ వెళ్తున్నారామె. "శ్రీదేవి.. శ్రీదేవి" అని జనం కేకలు వేస్తున్నారు. అందరికీ నమస్కారాలు చేస్తూ వడివడిగా ఆమె నడుస్తున్నారు. హఠాత్తుగా ఒక అబ్బాయి గుంపును చీల్చుకొని ఆమె ముందుకు వచ్చి, ఆమెకేసి క్షణ కాలం చూసి, చటుక్కుమని ఆమె కాళ్లమీదపడి చేతులతో ఆమె రెండు పాదాల్ని గట్టిగా పట్టుకొని పాదాభివందనం చేశాడు.
జనంలో గగ్గోలు మొదలైంది. కొంతమంది ఆ అబ్బాయిని పైకి లేవనెత్తడానికి ప్రయత్నించారు. కుదరలేదు. ఆఖరుకి పోలీసులు అతడ్ని బలవంతంగా పైకిలేవదీసి కొట్టబోయారు. శ్రీదేవి మనసు చివుక్కుమనిపించింది. ఆమె గబగబా పోలీసులను వారించి, "ప్లీజ్, అతడ్ని ఏమీ చెయ్యకండి" అని చెప్పారు. పోలీసులు ఆ కుర్రాడ్ని విడిచిపెట్టారు. శ్రీదేవి రూమ్‌కు వెళ్లి, రెడీ అయ్యి, షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు.
వాతావరణం అనుకూలంగా బాగుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ చూడ్డానికి చాలామంది జనం వచ్చారు. దాంతో అక్కడ కోలాహలంగా ఉంది. "సైలెన్స్" అన్నారు డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. వాతావరణం నిశ్శబ్దంగా మారింది. సడన్‌గా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ "శ్రీదేవిగారూ, నా జన్మ ధన్యమైంది." అన్న కేక వినిపించింది. ఆ కేక వినిపించిన వైపు శ్రీదేవి సహా అందరూ తలలుతిప్పి చూశారు. దూరంగా చెట్టుపై నుంచి అంతకుముందు శ్రీదేవి కాళ్లపైపడిన అబ్బాయి ఆనందంతో చేయి చూపుతున్నాడు. అదిచూసి శ్రీదేవి కళ్లు చెమర్చాయి.