English | Telugu
'చదువుకున్న అమ్మాయిలు'లో ఎత్తుగా కనిపించడానికి సావిత్రి వేసిన ఎత్తు!
Updated : Jun 11, 2021
సావిత్రి, కృష్ణకుమారి, ఇ.వి. సరోజ్ టైటిల్ రోల్స్ పోషించిన చిత్రం 'చదువుకున్న అమ్మాయిలు' (1963). డా. శ్రీదేవి సుప్రసిద్ధ నవల 'కాలాతీత వ్యక్తులు' ప్రేరణతో ఈ సినిమా కథను తయారుచేశారు. సావిత్రి, కృష్ణకుమారి ఇద్దరూ అక్కినేని నాగేశ్వరరావును ప్రేమిస్తారు. అక్కినేని మనసులో ఉండేది మాత్రం కృష్ణకుమారి. చివరకు పోలీస్ ఇన్‌స్పెక్టర్ శోభన్‌బాబు భార్య అవుతుంది సావిత్రి. ఆ విషయం అలా ఉంచితే, సావిత్రి కంటే కృష్ణకుమారి, ఇ.వి. సరోజ కాస్త పొడవు. ఆ ముగ్గురి కాంబినేషన్ సీన్లలో తను పొట్టిగా కనిపించకుండా ఉండేందుకు సావిత్రి ఓ ప్లాన్ వేశారు. ఆ కథేమిటంటే...
సావిత్రి తోడుగా దాక్షాయణి అనే అమ్మాయి ఎప్పుడూ ఆమెతోటే ఉండేది. సావిత్రి మేకప్ వగైరాలు శ్రద్ధగా చూసేది. అంతేకాదు, ఆమె ఏ సన్నివేశంలో ఏ నగలు పెట్టుకుందో, ఏ చీర కట్టుకుందో, కేశాలంకరణ వివరాలు సహా అన్నీ ఓ పుస్తకంలో రాస్తుండేది. ఆ సన్నివేశం తర్వాత వచ్చే సన్నివేశం వివరాలు రాసేది. సొంత నగలు వాడితే సహాయ దర్శకుడికి ఆ వివరాలు చెప్పేది. బాపాలాల్ నెక్లెస్, సింగపూర్ చెయిన్, సిలోన్ గాజులు.. ఇలా ఉండేవి ఆ వివరాలు. ఎప్పుడు మళ్లీ అవసరం వచ్చినా, సన్నివేశం చెబితే ఆ నగలన్నీ ఆ అమ్మాయి తీసుకువచ్చేది.
'చదువుకున్న అమ్మాయిలు' మూవీలో సావిత్రి, కృష్ణకుమారి, ఇ.వి. సరోజ కలిసి వుండే షాట్స్ చాలా ఉన్నాయి. వాళ్లిద్దరి కంటే తను పొట్టి కాబట్టి, అప్పటికే తను సింగపూర్ నుంచి తెప్పించుకున్న హైహీల్స్ వాడేవారు సావిత్రి. సెట్స్ మీద ఎప్పటికప్పుడు సావిత్రికి సంబంధించిన షాట్స్ గమనించే దాక్షాయణి, ఆ ముగ్గురి షాట్స్ ఎప్పుడు తీస్తున్నా, మూడో కంటికి తెలీకుండా సావిత్రి కాళ్ల దగ్గరకు ఆ చెప్పులు తీసుకువచ్చేది. "అక్కా! అంద సెరుపు కొండువందెన్ (అక్కా! ఆ చెప్పులు తెచ్చాను)" అని చెవిలో చెప్పి వెళ్లిపోయేది. సావిత్రి వాటిని వేసుకొని, సినిమాలో ఎక్కడా పొట్టిగా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు.