English | Telugu

అక్కినేని సినిమా షూటింగ్‌లో అనుకోని ప్ర‌మాదం.. నీటిలో కొట్టుకుపోయిన శార‌ద డూప్‌!

 

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌థానాయ‌కుడిగా వి. మ‌ధుసూద‌న‌రావు డైరెక్ట్ చేసిన హిట్ ఫిల్మ్ 'అమాయ‌కురాలు'. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను శార‌ద పోషించారు. అక్కినేని మేన‌మామ కూతురిగా ఆమె క‌నిపిస్తారు. హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను కాంచ‌న చేశారు. ఈ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా ఒక గగుర్పాటు క‌లిగించే ప్ర‌మాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌థ ప్ర‌కారం విల‌న్ ర‌మ‌ణ‌మూర్తి రెండో పెళ్లి చేసుకోవాల‌నే ప్లాన్‌తో భార్య అయిన శార‌ద‌కు మాయ‌మాట‌లు చెప్పి పిక్నిక్‌కు తీసుకువెళ్లి నీళ్ల‌లో నెట్టేస్తాడు. ఆమె కొన ఊపిరితో ఉండి, త‌న కూతుర్ని హీరో అక్కినేని చేతుల్లో పెట్టి చ‌నిపోతుంది.

ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం కేర‌ళ‌లోని త్రివేండ్రం ద‌గ్గ‌ర‌లో ఉన్న అరువికెరా డ్యామ్‌కు వెళ్లారు. ఆ డ్యామ్ ద‌గ్గ‌ర ప్ర‌వాహం విప‌రీతంగా ఉంది. ఈత కొట్ట‌డానికి వీల్లేనంత‌గా రాళ్లున్నాయి. శార‌ద‌కు ఈత రాక‌పోవ‌డంతో నీళ్ల‌లోకి నెట్టివేసే స‌న్నివేశ చిత్రీక‌ర‌ణ‌కు ఆమె బ‌దులు డూప్‌ను ఏర్పాటు చేశారు. ఆమె ఓ మ‌ల‌యాళీ అమ్మాయి. ఆమె న‌డుముకు ఒక తాడుక‌ట్టి బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా ఆ తాడును నీళ్ల‌లో వ‌దిలేశారు. ఇద్ద‌రు సెట్ బాయిస్ ఆ తాడును గట్టిగా ప‌ట్టుకొని ఉన్నారు. "స్టార్ట్ కెమెరా.. యాక్ష‌న్" అన్నారు డైరెక్ట‌ర్‌. వెంట‌నే డ్యామ్‌కున్న ఆరు లాక‌ర్స్ తెరుచుకున్నాయి. శార‌ద డూప్ నీళ్ల‌లోకి దూకింది. ఆమె న‌డుముకు క‌ట్టిన తాడును ప‌ట్టుకున్న కుర్రాళ్లు కెమెరా వ్యూలోకి వ‌స్తున్నార‌ని గ‌మ‌నించిన డైరెక్ట‌ర్ గ‌ట్టిగా అరిచారు. దాంతో కంగారుప‌డ్డ వాళ్లు తాడును వ‌దిలేశారు. 

మ‌హోధృతంగా ప్ర‌వ‌హిస్తోన్న నీళ్ల‌లో ఆ అమ్మాయి కొట్టుకుపోతోంది. యూనిట్ మొత్తం ఆందోళ‌న‌తో ఒడ్డున ప‌రుగెత్తుతోంది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు నీళ్ల‌లోకి దూకి ఆమెను ప‌ట్టుకోవాల‌నుకున్నాడు. కానీ ఆయ‌న కూడా ప్ర‌వాహంలో కొట్టుకుపోయాడు. కాస్త దూరంలో భ‌యంక‌ర‌మైన సుడిగుండాలున్నాయి. వాళ్లు దాదాపు 200 గజాల దూరం కొట్టుకుపోయాక‌, స్థానికులైన ఇద్ద‌రు యువ‌కులు నీళ్ల‌లోకి దూకి, శార‌ద డూప్‌ను, శ్రీ‌నివాస‌రావును ర‌క్షించి, ఒడ్డుకు చేర్చారు. షూటింగ్ చూడ్డానికి వ‌చ్చిన జ‌నం యూనిట్ మెంబ‌ర్స్‌ను కొట్టినంత ప‌నిచేశారు. అయితే అప్ప‌టికే మ‌ల‌యాళంలో శార‌ద‌కు మంచి ఇమేజ్ ఉండ‌టంతో, ఆమె వాళ్ల‌ను శాంతింప‌జేశారు. ప్ర‌మాదానికి గురైన అమ్మాయిని, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావును హాస్పిట‌ల్‌లో చేర్పించారు. శార‌ద సూచ‌న మేర‌కు డైరెక్ట‌ర్ మ‌ధుసూద‌న‌రావును నిర్మాత దుక్కిపాటి మ‌ధుసూద‌న‌రావు కారులో త‌న‌వెంట పెట్టుకొని తీసుకుపోయారు.

ఈ ప్ర‌మాదానికి కార‌ణాలుగా త‌ర్వాత తేలిన విష‌యాలేమంటే.. నాలుగు లాక‌ర్స్ తెరిపించ‌డానికి బ‌దులు మొత్తం ఆరు లాక‌ర్స్‌ను డైరెక్ట‌ర్ మ‌ధుసూద‌న‌రావు తెరిపించ‌డం, డైరెక్ట‌ర్ కేక‌లు వేయ‌డంతో సెట్ బాయ్స్ తాడు వ‌దిలేయ‌డం, త‌న‌కు ఈత వ‌చ్చ‌ని శార‌ద డూప్ అబ‌ద్ధం చెప్ప‌డం. అక్క‌డి దేవాల‌యానికి నిర్మాత మ‌ధుసూద‌న‌రావుతో విరాళం ఇప్పించి, పూజ‌లు చేయించి మొత్తానికి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రింప‌జేశారు శార‌ద‌.