English | Telugu
'వీరాభిమన్యు'లో సెట్స్ మీదే శోభన్‌బాబును తీసేద్దామన్న నిర్మాత డూండీ!
Updated : Jun 9, 2021
అందాల నటుడు దివంగత శోభన్‌బాబు కెరీర్‌లో తొలి మైలురాయిగా నిలిచిన చిత్రం 'వీరాభిమన్యు' (1965). వి. మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుందర్‌లాల్ నహతా, డూండీ కలిసి నిర్మించారు. శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్, అర్జునునిగా కాంతారావు నటించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను శోభన్‌బాబు, ఆయన భార్య ఉత్తరగా కాంచన నటించారు. శోభన్, కాంచనలకు జంటగా ఇదే తొలి చిత్రం. 'కాదలిక్కనేరమిల్లై' (తమిళం) చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన కాంచన తొలి తెలుగు చిత్రం 'వీరాభిమన్యు' అయినా, ముందుగా విడుదలైంది మాత్రం అక్కినేని సరసన నటించిన 'ప్రేమించి చూడు' చిత్రం.
'వీరాభిమన్యు' సినిమా ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణమైంది. రెండు భాషల్లోనూ ఉత్తర పాత్రను కాంచన పోషించారు. తమిళంలో అభిమన్యుడి పాత్రను ఎ.వి.ఎం. రాజన్ చేశారు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే ముందు ఒక కీలక సన్నివేశాన్ని శోభన్‌బాబు మీద చిత్రీకరించడానికి రెండు రోజులు పట్టింది. శోభన్‌బాబు అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంతో శ్రమపడి నటిస్తున్నప్పటికీ డైరెక్టర్ ఆశించిన ఎఫెక్ట్ రావట్లేదు. ఎప్పటికీ టేక్ ఓకే అవడం లేదు. పైగా ఆ టైమ్‌లో శోభన్ జ్వరంతో ఉన్నారు.
చివరకు నిర్మాత డూండీకి విసుగొచ్చేసింది. "మరి లాభంలేదు. ఈ కుర్రాడు వద్దు.. చేయలేడు. ఈ పాత్రకు ఇంకెవరినన్నా వేసుకుందాం" అన్నారు. అప్పుడు అక్కడున్నవాళ్లంతా, "అయ్యయ్యో పాపం.. అంతపని చేస్తే ఎలా.. కుర్రాడి భవిష్యత్తు దెబ్బతింటుంది. అతని లైఫ్ పోతుంది. మరో చాన్స్ ఇచ్చి చూడండి" అని చెప్పారు. మరుసటిరోజు మళ్లీ అదే సన్నివేశాన్ని శోభన్ మీద చిత్రీకరించారు. ఈ సారి డైరెక్టర్ అనుకున్న ఎఫెక్ట్‌ను ఆయన ఇవ్వగలిగారు. షాట్ ఓకే అయ్యింది. అంతగా శ్రమపడి చేసినందుకు ఫలితం దక్కింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, శోభన్‌బాబుకు చాలా మంచి పేరొచ్చింది. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కాంచన పంచుకున్నారు.