English | Telugu
జంధ్యాల సినిమాలో హీరోయిన్‌గా చెయ్యనని తెగేసి చెప్పిన అమ్మాయి!
Updated : Jun 8, 2021
రచయితగా, దర్శకునిగా జంధ్యాలకు ఎంత పేరుందో, మంచి మనిషిగా అంతకంటే ఎక్కువ పేరుంది. ఆయనేమైనా ట్రబుల్స్ పడ్డారేమో కానీ, ఎవరికీ ఎప్పుడూ ట్రబుల్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. రైటర్‌గా ఎంతో గిరాకీ ఉన్న ఆయన బోల్డ్ స్టెప్ తీసుకొని 'ముద్దమందారం' (1981) చిత్రంతో దర్శకునిగా మారారు. 'నాలుగు స్తంభాలాట' (1982) సినిమా దర్శకునిగా ఆయనను ఓ మెట్టుపైకెక్కించింది. దాని తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. దర్శకుడిగా కొనసాగుతూనే రైటర్‌గానూ పనిచేస్తూ వచ్చారాయన.
సినిమాకి ఉన్న గ్లామర్ అందరికీ తెలుసు. సినిమా ప్రపంచంలోకి రావాలని, ఎలాగో అలా తెరమీద తన పేరు పడితే చాలని, మొహం కనిపిస్తే చాలనుకొనేవాళ్లు కృష్ణానగర్ ఏరియాలో కొల్లలుగా కనిపిస్తారు. 'ముద్ద మందారం' చిత్రంలో హీరోయిన్ వేషం కోసం అమ్మాయిని సెలక్ట్ చేయడానికి జంధ్యాల ఎన్నో ఊర్లు తిరిగారు. ఎంతోమందిని చూశారు. అలా తిరుగుతుండగా ఓ ఊరిలో ఆయనకు ఒక అమ్మాయి కనిపించింది. చూసీ చూడగానే "ఈ అమ్మాయే నా ముద్ద మందారం" అనుకున్నారు. వెంటనే ఆ ఊళ్లోని కొందరు పెద్దమనుషుల సాయంతో ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కలిశారు జంధ్యాల.
వాళ్లు తమ కూతుర్ని సినిమాల్లోకి పంపడానికి ఇష్టపడలేదు. ఎలాగైతేనేం వాళ్లను కన్విన్స్ చేసి ఒప్పించారు జంధ్యాల. కానీ అంతలోనే హఠాత్తుగా వాళ్ల మధ్యకు ఆ అమ్మాయి వచ్చింది. "సార్.. నన్ను క్షమించండి. నేను మీ సినిమా చేయను. అసలు నేను సినిమాల్లోకి రాను." అని చెప్పేసింది. జంధ్యాల ఆశ్చర్యపోయి, "ఫర్వాలేదమ్మా.. నీకేం కాదు, మీ అమ్మానాన్నలు కూడా ఒప్పుకున్నారు కదా." అని నచ్చజెప్పబోయారు. అయినా ఆ అమ్మాయి ససేమిరా అంది. పెద్దమనుషులు కూడా ఆమెను ఒప్పించాలని చూశారు.
"సార్.. మా అమ్మానాన్నలు తెచ్చిన సంబంధం చేసుకొని హాయిగా సంసారం చేసుకుందామని అనుకుంటున్నాను. అది మీకిష్టం లేదా?" అని అడిగింది ఆ అమ్మాయి. జంధ్యాల సహా అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. జంధ్యాల ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని, అక్కడ్నుంచి వచ్చేశారు. తిరిగి అన్వేషణలో పడి, ఎట్టకేలకు పూర్ణిమను 'ముద్దమందారం'గా సెలక్ట్ చేశారు. ఇది ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జంధ్యాల స్వయంగా చెప్పిన విషయం.