English | Telugu

అన‌సూయ‌ నుంచి ప్ర‌దీప్ దాకా.. బాగా చ‌దువుకున్న ఆరుగురు టీవీ యాంక‌ర్స్!

 

తెలుగు టెలివిజ‌న్‌పై చాలామంది యాంక‌ర్లు ప‌నిచేస్తున్నారు. వారిలో కొంత‌మందికి స్టార్ యాక్ట‌ర్ల‌తో స‌మాన‌మైన ఇమేజ్ వ‌చ్చిందంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సుమ‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, ప్ర‌దీప్ మాచిరాజు, ర‌ష్మీ గౌత‌మ్, సుడిగాలి సుధీర్ లాంటివాళ్లు స్టార్ యాంక‌ర్స్‌గా రాజ్యం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వాళ్ల‌కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వాళ్ల ఫాలోయ‌ర్స్‌తో పోలిస్తే, అనేక‌మంది హీరోల ఫాలోయ‌ర్స్ సోష‌ల్ మీడియాలో త‌క్కువ‌గా ఉండ‌టం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ యాంక‌ర్ల‌లో కొంత‌మంది ఉన్న‌త విద్యావంతులు కాగా, కొంత‌మంది ఇంజ‌నీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఏ యాంక‌ర్ ఏం చ‌దువుకున్నారో ఓసారి చూద్దామా..

సుమ క‌న‌కాల‌


'క‌ల్యాణ ప్రాప్తిర‌స్తు' (1996) సినిమాతో న‌టిగా కెరీర్ ఆరంభించిన సుమ త‌ర్వాత టీవీ రంగానికి మారారు. స్టార్ మ‌హిళ హోస్ట్‌గా స్టార్ యాంక‌ర్ స్టేట‌స్ పొందారు. స్వ‌రాభిషేకం షోకు ప్ర‌యోక్త‌గా వ్య‌వ‌హ‌రించిన ఆమె క్యాష్‌, భ‌లే చాన్స్ లే, జీన్స్‌, బిగ్ సెల‌బ్రిటీ చాలెంజ్‌, స్టార్ట్ మ్యూజిక్ లాంటి షోల‌తో తిరుగులేని యాంక‌ర్‌గా రాణిస్తున్నారు. ఆమె ఎంకామ్ చ‌దువుకున్నారు.

ఝాన్సీ


సినీ న‌టిగా కెరీర్ ఆరంభించిన ఝాన్సీ ఓవైపు టీవీ యాంక‌ర్‌గా, ఇంకోవైపు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. టాక్ ఆఫ్ ద టౌన్‌, సండే సంద‌డి, కో అంటే కోటి, ల‌క్కు కిక్కు, స్టార్ట్ మ్యూజిక్ లాంటి షోల‌తో వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఝాన్సీ వీఐటీ (వెల్లూర్‌) నుంచి బీటెక్ (కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌) చేశారు.

ఉద‌య‌భాను


'ఎర్ర‌సైన్యం' (1994) సినిమాతోటే న‌టిగా కెరీర్ మొద‌లుపెట్టిన ఉద‌య‌భాను ఆ త‌ర్వాత అటు సినిమాలు, ఇటు టీవీ షోల‌తో పాపుల‌ర్ అయ్యారు. హృద‌యాంజ‌లి, ఒన్స్ మోర్ ప్లీజ్‌, తీన్‌మార్‌, రేలా రే రేలా, రంగం, ఢీ, పిల్ల‌లు పిడుగులు, నీతోనే డాన్స్ లాంటి షోలు ఆమెను టాప్ యాంక‌ర్ల‌లో ఒక‌రిని చేశాయి. ఆమె ఎంఏ చ‌దివారు.

అన‌సూయ భ‌ర‌ద్వాజ్ 


సాక్షి టీవీలో న్యూస్ ప్రెజెంట‌ర్‌గా కెరీర్ ఆరంభించిన అన‌సూయ 2013లో జ‌బ‌ర్ద‌స్త్ షోకు యాంక‌ర్‌గా మార‌డంతో ఆమె కెరీర్ స్వ‌రూప‌మే మారిపోయింది. మోడ్ర‌న్ మహాలక్ష్మి, ఎ డేట్ విత్ అన‌సూయ‌, జాక్‌పాట్‌, డ్రామా జూనియ‌ర్స్‌, రంగ‌స్థ‌లం లాంటి షోలతో మోస్ట్ గ్లామ‌ర‌స్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ ఆమె మంచి వేషాలు వేస్తున్నారు. ఆమె హైద‌రాబాద్‌లోని బ‌ద్రుకా కాలేజ్‌లో ఎంబీఏ ప‌ట్ట‌భ‌ద్ర‌రాలు.

ప్ర‌దీప్ మాచిరాజు 


'కొంచెం ట‌చ్‌లో ఉంటే చెప్తా' షోతో పాపుల‌ర్ అయిన ప్ర‌దీప్ ఇవాళ టాప్ మేల్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ సెల‌బ్రిటీ చాలెంజ్‌, అదుర్స్‌, ఢీ, పెళ్లిచూపులు, కిక్‌, డ్రామా జూనియ‌ర్స్‌, ల‌క్ష్మీదేవి త‌లుపుత‌డితే లాంటి షోల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌దీప్ ప‌దేళ్ల క్రితం నుంచే అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో క‌నిపిస్తూ వ‌స్తున్నాడు. '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?'  సినిమాతో హీరోగా మారిన అత‌ను విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌లో బీటెక్ చేశాడు.

యాంక‌ర్ లాస్య 


ర‌వితో క‌లిసి చేసిన 'స‌మ్‌థింగ్ స్పెష‌ల్' షోతో పాపుల‌ర్ అయ్యింది లాస్య‌. మొండిమొగుడు పెంకిపెళ్లాం, ఢీ షోలు ఆమెకు పేరు తెచ్చాయి. కొన్ని సినిమాల్లోనూ న‌టించిన లాస్య కొంత కాలం విరామంతో మ‌ళ్లీ వ‌చ్చిన ఆమె మ‌రోసారి ర‌వితో క‌లిసి 'కామెడీ స్టార్స్‌'కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. సీబీఐటీ నుంచి ఆమె బీటెక్ చేసింది.

మిగ‌తా యాంక‌ర్స్‌లో ర‌వి, ర‌ష్మీ గౌత‌మ్‌, ఓంకార్‌, హ‌రితేజ‌, శ్యామ‌ల‌, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ డిగ్రీ హోల్డ‌ర్లు కాగా, సుడిగాలి సుధీర్ మాత్రం ఫ్యామిలీకి స‌పోర్ట్‌గా ఉండాల‌ని ఇంట‌ర్మీడియేట్‌తోటే చ‌దువు ఆపేసి, ఉద్యోగంలో చేరిపోయాడు.