English | Telugu
ఎన్టీఆర్, ఏఎన్నార్ సమక్షంలో.. మోహన్‌బాబును "పప్పారాయుడు" అని పిలిచిన జనం!
Updated : Aug 2, 2021
డైలాగ్ కింగ్‌గా మోహన్‌బాబు పేరు తెచ్చుకున్నారు. ఎంతటి క్లిష్టమైన డైలాగ్‌నైనా సునాయాసంగా చెప్పడంలో విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు అగ్రగణ్యులు. ఆయన తర్వాత డైలాగ్స్ చెప్పడంలో మోహన్‌బాబు అంతటి పేరును సంపాదించుకున్నారు. ఆ ఇద్దరూ కలిసి నటించిన సినిమాల్లో.. ఆ ఇద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాల్లో వారు చెప్పిన డైలాగ్స్ అభిమానుల్ని అమితంగా అలరించాయి. అందుకు 'సర్దార్ పాపారాయుడు', 'కొండవీటి సింహం' చిత్రాలు నిదర్శనం.
'సర్దార్ పాపారాయుడు' సినిమాలో మోహన్‌బాబు చేసింది చిన్నపాత్రే అయినా ప్రేక్షకుల హృదయాలపై అది ముద్రించుకుపోయింది. అందులో "పప్పారాయుడూ" అంటూ ఎన్టీఆర్‌ను మోహన్‌బాబు సంబోధించే తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఆ మూవీలో మోహన్‌బాబు బ్రిటీష్ దొర పాత్రలో కనిపించారు. "మా వంటలు చేసేవాడు భారతీ..యుడు, మా దీపాలు వెలిగించేవాడు భారతీ..యుడు, మా తోటమాలి భారతీ..యుడు, మా బట్టలుతికేవాడు భారతీ..యుడు.." అంటూ ఆ పాత్రకు తగిన ధోరణిలో ఆయన చెప్పిన డైలాగ్స్‌కు మంచి పేరు వచ్చింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన 'సత్యం శివం' సినిమాలోనూ మోహన్‌బాబు నటించారు. ఆ సినిమాని నిర్మించింది ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆ సినిమా షూటింగ్‌కు వైజాగ్ వెళ్లినప్పుడు, లొకేషన్ మార్పులో రామారావు, నాగేశ్వరరావు, మోహన్‌బాబు ఒకే కారులో ప్రయాణించారు. మోహన్‌బాబు ముందు సీట్లో కూర్చుంటే, రామారావు, నాగేశ్వరరావు వెనుక సీట్లో కూర్చున్నారు. దారిలో ఒకచోట ఎందుకనో కారు ఆపించి మోహన్‌బాబు కిందికి దిగారు. అప్పుడు అక్కడి జనం ఆయనను చూసి, "పప్పారాయుడు.. పప్పారాయుడు" అని అరవడం ప్రారంభించారు. ఆ పాత్ర అలా ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోయిదంటే.. అది ఆయన డైలాగ్స్ చెప్పిన విధానం.. ఆ డైలాగ్స్‌ను అలా రాసి, తీసిన దర్శకుడు దాసరి నారాయణరావు ప్రతిభ!
ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు నాగేశ్వరరావు. ఆ తర్వాత "ఏం.. వీళ్లందరికీ డబ్బులిచ్చావా.. పప్పారాయుడు.. పప్పారాయుడు అని నిన్నే పొగుడుతున్నారు" అని జోక్ చేశారు. ఎన్టీఆర్, మోహన్‌బాబు నవ్వేశారు. అలా సన్నివేశాలు ఎంత క్లిష్టమైనవి అయినా, దర్శకుడి ఊహలకు తన ఊహ జోడించి నటించడం అలవాటు చేసుకోవడం వల్లే విలక్షణ నటునిగా మోహన్‌బాబు కీర్తి సంపాదించారు.