English | Telugu
సాయికుమార్ వాళ్లమ్మ పుట్టింటి నేపథ్యం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Updated : Aug 1, 2021
నటునిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సాయికుమార్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు మనకు తెలిసిందే. కంఠమే ఆయనకు మెయిన్ ఎస్సెట్. ఆ కంఠం తండ్రి పీజే శర్మ (పూడిపెద్ది జోగేశ్వరశర్మ) నుంచి ఆయనకు వారసత్వంగా వచ్చింది. ఆయన కూడా నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. సాయికుమార్ చిన్నప్పట్నుంచీ అమ్మకూచి. అమ్మంటే ఆయనకు చాలా ఇష్టం. సాయికుమార్ తల్లి కృష్ణజ్యోతికి మన సంస్కృతి సంప్రదాయాలన్నా, పురాణాలన్నా ఎంతో గౌరవం. చిన్నప్పుడు ఆర్థికంగా వారి కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. పిల్లల స్కూలు ఫీజులు కూడా తండ్రి పీజే శర్మ కట్టలేకపోయేవారు.
సాయికుమార్, ఆయన పెద్దచెల్లెలు స్కాలర్‌షిప్పులతోనే చదువుకున్నారు. ఆయనెప్పుడూ టెక్ట్స్ బుక్స్ కొనుక్కోలేదు. సీనియర్ల దగ్గర బుక్స్ తెచ్చుకొని చదువుకొనేవారు. క్యారేజీ తెచ్చుకోనివాళ్లకు స్కూల్లో మధ్యాహ్నం పూట గోధమన్నం పెట్టేవాళ్లు. అది తినలేక ఆయన చెల్లి ఏడ్చేది. ఆయనకూ ఆ తిండి ఇష్టం ఉండేది కాదు. ఇలాంటి కష్టాల మధ్య ఆయనకు ఊరట అమ్మ చెప్పే కథలే. ఆమె భారతంలోని కథలు చెప్పేది. భాగవత పద్యాలు నేర్పించేది. ఒక్క మాటలో చెప్పాలంటే సాయికుమార్ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది వాళ్లమ్మ!
అప్పట్లో పీజే శర్మ రైల్వే ఉద్యోగి. విజయనగరంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ జె.వి. సోమయాజులు, జె.వి. రమణమూర్తి సోదరలుతో కలిసి నాటకాలు వేసేవారు. నటనమీద ఆసక్తితో మద్రాసు వెళ్లి సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేస్తుండేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 1959లో మద్రాసులో స్థిరపడ్డారు శర్మ. ఇక సాయికుమార్ వాళ్లమ్మ ఒకప్పుడు మహారాణిలా బతికారు. వాళ్లది కర్ణాటకలోని బాగేపల్లి అనే ఊరు. ఆమె ముత్తాతలు మైసూరు రాజుల దగ్గర పనిచేశారు. పెళ్లి కాకముందు ఆమె పోలో ఆడేవారు! పీజే శర్మ కోసం అన్నీ వదులుకొని వచ్చేశారు. ఆ ఇద్దరినీ కలిపింది రంగస్థలం.
ఒకసారి నాటక పోటీల్లో స్టేజిమీద కృష్ణజ్యోతిని అనార్కలి వేషంలో చూసి ఇష్టపడ్డారు శర్మ. అదే పోటీల్లో వేరే నాటకంలో ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. ఇద్దరికీ అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రణయంగా మారింది. దాంతో స్నేహితులందరూ కలిసి వారి పెళ్లి జరిపించారు.
ఆ దంపతులకు మొదట సాయికుమార్ పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.. మొత్తం ఐదుగురు సంతానాన్ని కన్నారు. పీజే శర్మ 81 సంవత్సరాల వయసులో 2014 డిసెంబరులో మృతి చెందారు.