English | Telugu
ఇరవైల్లో 90 ఏళ్ల వృద్ధురాలి పాత్ర.. సింగిల్ టేక్‌లో చేసిన జీవిత!
Updated : Aug 2, 2021
నాగార్జున కథానాయకుడిగా నటించిన 'జానకి రాముడు' చిత్రంలో విజయశాంతి, జీవిత హీరోయిన్లుగా నటించారు. ఏఎన్నార్-సావిత్రి క్లాసిక్ ఫిల్మ్ 'మూగమనసులు' తరహాలోనే ఈ సినిమాను కె. రాఘవేంద్రరావు రూపొందించారు. 'మూగమనసులు'లో జమున చేసిన పాత్ర తరహాలో 'జానకి రాముడు'లోని జీవిత పాత్ర నడుస్తుంది. కథానుసారం 90 ఏళ్ల వృద్ధురాలిగా జీవిత కనిపిస్తారు. సినిమా ప్రారంభంలో హీరో హీరోయిన్ల పునర్జన్మ కోసం ఆమె ఎదురుచూస్తుంటుంది. ఆ పాత్ర మళ్లీ సినిమా క్లైమాక్స్‌లోనే కనిపిస్తుంది.
ముసలితనాన్ని మేకప్ టెక్నిక్ ఉపయోగించి చూపిస్తారు. కానీ తొంభై సంవత్సరాల వృద్ధులు ఎలా నడుస్తారు? ఎలా మాట్లాడతారు?.. వారి ప్రవర్తనాధోరణి ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నటించి చూపడం ట్వంటీస్‌లో ఉన్న జీవిత లాంటి తారలకు చాలా కష్టమనే చెప్పాలి. అప్పటికి జీవితకు ఆ తరహా పాత్రలు చేసిన అనుభవం లేదు. వయసుమీద పడ్డవాళ్లు యువపాత్రలు పోషించగలరు. ఎందుకంటే వాళ్లకు పడుచుదనంలో ఎలా ఉంటారో అనుభవ పూర్వకంగా తెలుసు కాబట్టి.
ఆ పాత్రను ఎలా చెయ్యాలనేది జీవితకు అర్థం కాలేదు. ఎవరూ ఇలా చెయ్యాలని కానీ, అలా చెయ్యాలని కానీ చెప్పలేదు. ఔట్‌డోర్ షూటింగ్.. విపరీతమైన జనం. యూనిట్‌లోని వారంతా ఎవరి హడావిడిలో వాళ్లున్నారు. ఒకవైపు సత్యనారాయణ, నాగార్జున, మోహన్‌బాబు, విజయశాంతి లాంటి పేరుపొందిన నటులున్నారు. జీవితకు ఒకటే టెన్షన్!!
చివరకు డైరెక్టర్ రాఘవేంద్రరావును ఎలా చెయ్యాలని అడిగారు. "ఏముందమ్మా ఇందులో. నువ్వ అనవసరంగా ఆందోళన పడుతున్నావు గానీ.." అన్నారాయన. "అదికాదండీ.. ఒక్కసారి మీరు యాక్ట్ చేసి చూపిస్తే బాగుంటుంది" అన్నారు జీవిత. సరేనని ఆయన ఒకసారి యాక్ట్ చేసి చూపించారు. ఆయన ఎలా చేశారో అలాగే చేశారు జీవిత. ఆశ్చర్యం.. సెకండ్ టేక్ అవసరం లేకుండానే సింగిల్ టేక్‌లోనే ఆ సన్నివేశాన్ని ఓకే చేశారు రాఘవేంద్రరావు. ఆ వృద్ధురాలి గెటప్ సన్నివేశాల్ని రెండు రోజుల పాటు చిత్రీకరించారు. ఆ రెండు రోజులూ జీవిత పడిన ఆందోళన అంతా ఇంతా కాదు.