English | Telugu

బాల‌య్య కాలు కాలినా ప‌ట్టించుకోకుండా నెక్ట్స్ షాట్‌కు రెడీ అవ‌మ‌న్న ఎన్టీఆర్‌!

 

విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు పేరు చెబితే ఎవ‌రికైనా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో మొద‌టగా గుర్తుకొచ్చేది క్ర‌మ‌శిక్ష‌ణ‌. ఆయ‌న న‌ట‌వార‌సుడు బాల‌కృష్ణ‌కు సైతం అది బాగా అల‌వ‌డింది. షూటింగ్ టైమ్‌లో జ‌న‌ర‌ల్‌గా సినిమాటోగ్రాఫ‌ర్స్ లైటింగ్ సెట్ చేసే స‌మ‌యంలో సీనిక్ మూడ్‌ను బ‌ట్టి లైట్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారు. అప్పుడు యాక్ట‌ర్లు ఎక్క‌డ నిల్చుంటే వారి ముఖాల‌పై ఎలా లైటింగ్ ప‌డుతుందో టెస్ట్ చేస్తుంటారు. ఈ త‌ర‌హా టెస్టింగ్ టైమ్‌లో ఎవ‌రో ఒక‌ర్ని నిల్చోబెట్టి వారిపై లైటింగ్ బ్యాలెన్స్ చేస్తుంటారు. కానీ అటు ఎన్టీఆర్ కానీ, ఇటు బాల‌కృష్ణ కానీ.. వారే స్పాట్‌లో నిల్చొని ఎంత‌సేపైనా టెక్నీషియ‌న్స్‌కు స‌హ‌క‌రించేవారు.

ఎన్టీఆర్.. 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర' (1991) తీస్తున్న రోజుల‌వి. ఆ మూవీలో హ‌రిశ్చంద్రునిగా, దుష్యంతునిగా డ్యూయ‌ల్ రోల్ పోషించారు బాల‌కృష్ణ‌. హ‌రిశ్చంద్రుని కాటికాప‌రి సీన్‌లో శవం పైకిలేస్తే, దానిని నొక్కిపెట్టి న‌టించాలి. శ‌వం కాలుతున్న‌ట్లు మంట‌లు పైకి లేవాలి. ఆ రోజుల్లో మంట‌లు లేచేందుకు ఇప్ప‌టి టెక్నిక్స్ లేవు. దాంతో నిజంగానే యూనిట్ మంట‌లు రాజేసింది. అనుకోకుండా ఆ మంట‌లు బాల‌య్య కాలును అంటుకున్నాయి. ఆయ‌న కాలు క‌మిలిపోయింది. కాలు విప‌రీత‌మైన మంట‌లు పుడుతుంటే అల్లాడిపోయారు.

ఎన్టీఆర్ మాత్రం షాట్ బాగా వ‌చ్చింద‌ని ఆనందిస్తూ బాల‌య్య‌ను నెక్ట్స్ షాట్‌కు రెడీ అవ‌మ‌న్నారు. పంటిబిగువున బాధ భ‌రిస్తూ షాట్‌కు రెడీ అయ్యి వ‌చ్చి, నొప్పి బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా న‌టించారు బాల‌య్య‌. త‌న బాధ‌ను ఆయ‌న తండ్రికి చెప్పుకోలేదు. ఆ సినిమాకు ఛాయాగ్రాహ‌కునిగా ప‌నిచేసింది బాల‌య్య అన్న‌య్య నంద‌మూరి మోహ‌న‌కృష్ణ‌. ఈ ఉదంతానికి ప్ర‌త్య‌క్ష సాక్షి ఆయ‌నే.