English | Telugu
నాలుగు రకాల సినిమాలు.. ఎన్టీఆర్ తర్వాత ఆ మొనగాడు బాలయ్య ఒక్కడే!
Updated : Jun 10, 2021
మహానటుడు ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక.. నాలుగు తరహా చిత్రాల్లోనూ రాణించిన, మెప్పించిన ఏకైక నటునిగా నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారు, చరిత్రలో నిలిచిపోయారు. ఆయన తరం నుంచి ఈ నాలుగు రకాల సినిమాల్లో నటించిన మరో హీరో ఒక్కరు కూడా లేరు. పదిహేనేళ్ల వయసులోనే 'వేములవాడ భీమకవి' (1976)లో భీమకవిగా నటించడం ద్వారా తొలిసారి ఓ చారిత్రక పాత్రను పోషించారు బాలకృష్ణ. ఆ సినిమా దర్శకుడు స్వయంగా ఎన్టీఆర్. అలా చిన్ననాటే తండ్రి శిక్షణలో రాటుదేలిన బాలయ్య అనేక తరహా పాత్రలు పోషించి, ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత కాలంలో ఆయన సలీమ్ (అక్బర్ సలీమ్ అనార్కలి - 1978), సిద్ధయ్య (శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర - 1976), శ్రీకృష్ణదేవరాయలు (ఆదిత్య 369 - 1991) లాంటి చారిత్రక పాత్రలు చేశారు.
చేసింది ఒకటే జానపద చిత్రమైనా.. అది చరిత్ర సృష్టించిన 'భైరవ ద్వీపం' (1994) కావడం విశేషం. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఆ సినిమా నటునిగానూ బాలయ్యకు గొప్ప పేరు తీసుకొచ్చింది. అందులో కురూపిగా మారినప్పుడు ఆయన ప్రదర్శించిన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
పదహారేళ్ల వయసులో తొలిసారి ఓ పౌరాణిక పాత్ర చేశారు బాలకృష్ణ. తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'దానవీరశూర కర్ణ' (1977) చిత్రంలో అభిమన్యుని పాత్ర పోషణతో చిచ్చరపిడుగు అనిపించుకున్నారు. ఆ తర్వాత అదే పాత్రను శ్రీమద్విరాట పర్వము (1979)లో చేసిన బాలయ్య.. నారద (శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం - 1979), హరిశ్చంద్ర, దుష్యంత (బ్రహ్మర్షి విశ్వామిత్ర - 1991), శ్రీకృష్ణ, అర్జున (శ్రీ కృష్ణార్జున విజయము - 1996), శ్రీరామ (శ్రీరామరాజ్యం - 2011) పాత్రలు పోషించారు. 'పాండురంగడు' (2008) చిత్రంలోనూ ఆయన శ్రీకృష్ణునిగా కనిపించారు.
ఇక సాంఘికాల విషయానికొస్తే.. తండ్రి పోషించని తరహా పలు పాత్రలు పోషిస్తూ వచ్చారు. తెలుగునాట ఫ్యాక్షనిజానికి కూడా హీరో ఇమేజ్ తెచ్చిన ఘనత ఆయనదే. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' సినిమాలతో ఆయన రికార్డులు సృష్టించడంతో మిగతా స్టార్లు కూడా ఆ తరహా పాత్రలు పోషించారు.