English | Telugu
'అర్ధ శతాబ్దం' మూవీ రివ్యూ - పువ్వు రగిల్చిన రావణ కాష్ఠం!
Updated : Jun 11, 2021
సినిమా పేరు: అర్ధ శతాబ్దం
తారాగణం: కార్తీక్ రత్నం, కృష్ణప్రియ, సాయికుమార్, నవీన్ చంద్ర, శుభలేఖ సుధాకర్, అజయ్, ఆమని, పవిత్రా లోకేశ్, శరణ్యా ప్రదీప్, సుహాస్, రామరాజు, రాజా రవీంద్ర, దిల్ రమేశ్, టీఎన్ఆర్, దయానంద్, గౌతంరాజు
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక, కడలి సత్యనారాయణ, సుందర్ మిట్టపల్లి
సంగీతం: నోఫెల్ రాజా
సినిమాటోగ్రఫీ: వెంకట ఆర్.శాఖమూరి
ఎడిటింగ్: జె. ప్రతాప్ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: సుమిత్ పటేల్
నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు
రచన-దర్శకత్వం: రవీంద్ర పుల్లె
బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్
విడుదల తేదీ: 11 జూన్ 2021
ప్లాట్‌ఫామ్: ఆహా (ఓటీటీ)
మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రెండోసారి థియేటర్లు మూతపడిన తరుణంలో పెద్ద సినిమాలు కాకపోయినా, చిన్న సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను నమ్ముకుంటున్నాయి. థియేటర్లలో సొంతంగా రిలీజ్ చేసుకొని రిస్క్ చేసే బదులు, సంతృప్తికరమైన ఆఫర్ వస్తే, ఓటీటీకి తమ సినిమాలను అమ్ముకుంటున్నారు నిర్మాతలు. అలా లేటెస్ట్‌గా ఆహా ప్లాట్‌ఫామ్‌పై రిలీజైన మరో చిన్న సినిమా, కొద్ది రోజులుగా ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చిన సినిమా 'అర్ధ శతాబ్దం'.
కథ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని సిరిసిల్లలో 2003 సంవత్సరంలో జరిగిన కథగా అర్థ శతాబ్దం మన ముందుకొచ్చింది. చేనేత కుటుంబానికి చెందిన కృష్ణ (కార్తీక్ రత్నం), ఎలిమెంటరీ స్కూలు రోజుల నుంచే తనతో చదువుకున్న అగ్రకులపు అమ్మాయి పుష్ప (కృష్ణప్రియ)తో ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను తెలియజేయడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తుంటాడు కానీ, ధైర్యం చాలదు. టీ బంకు దగ్గర ఉండే గులాబీ మొక్కకు పువ్వు కాస్తే, ఆ పువ్వు ఇచ్చి, తన ప్రేమను తెలియజేయాలనుకుంటాడు. మొగ్గ వస్తుంది. మరుసటి రోజు పొద్దున్నే ఎవరో ఆ పువ్వును కోసేస్తారు. పుష్ప తలలో గులాబీ పువ్వు కనిపిస్తే, తమ ప్రత్యర్థి గ్రూపుకు చెందిన కుర్రాడు అది ఇచ్చివుంటాడని ఊహించుకొని, కృష్ణ, అతని స్నేహితులు దారికాచి, అతడిని చితగ్గొడతారు. వాడు వెళ్లి ఈ విషయం తమ పెద్దలకు చెప్తారు. ఊరు రావణ కాష్ఠం అవుతుంది. కృష్ణ ప్రేమకథ ఏమైంది? ఒక పువ్వు ఎలాంటి విపరిణామాలను సృష్టించింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ
స్వాతంత్ర్యం సాధించుకొని రాజ్యాంగం అమల్లోకి వచ్చి అర్ధ శతాబ్దం గడిచిపోయినా కులం అనేది ఎలా మనుషుల్ని వేర్వేరుగా ఉంచుతుందో, నిమ్న కులాలవారిని అగ్రకులాల వారు ఎలా అణచివేస్తూనే ఉంటున్నారో 'అర్ధ శతాబ్దం' కథ ద్వారా దర్శకుడు రవీంద్ర పుల్లె చెప్పాలనుకున్నాడు. కథ ఎత్తుగడ బాగానే ఉంది, మొదట్లో కల్పించిన సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఒక గులాబీ పువ్వు సీన్‌లోకి వచ్చిందో, అప్పుడు కథనంలో ఆసక్తి సన్నగిల్లింది. నిజానికి అప్పుడే దర్శకుడు సన్నివేశాలను ఆసక్తికరంగా కల్పించాలి. అందుకు భిన్నంగా హాస్యాస్పదమైన సన్నివేశాలతో కథనాన్ని నీరసింపజేశాడు. ఓవైపు ఊళ్లో ఒకర్నొకరు నరుక్కుంటుంటే, ఇంకోవైపు ప్రధాన పాత్రల ఇళ్లల్లో ఆ సంగతేమీ తెలీదన్నట్లు ప్రశాంత వాతావరణం కనిపిస్తుందెందుకో తెలీదు. ఊళ్లల్లో ఏ చిన్నగొడవ జరిగినా క్షణాల్లో ఆ వార్త ఊరంతా పాకిపోతుంది అనే విషయాన్ని దర్శకుడు విస్మరించాడు.
అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించేది ఊళ్లో రెండు గ్రూపులు హత్యాకాండ సృష్టిస్తున్నాయని స్పష్టంగా తెలిసినా, తానే ఎవరికంటా పడకుండా సందుగొందుల్లో తప్పించుకుపోతూ వచ్చిన కృష్ణ ఎలా పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను బయటకు తెస్తాడు? ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర సురక్షితంగా ఉన్న ఆమెను స్వయంగా అత్యంత ప్రమాదభరితమైన వాతావరణంలోకి ఎందుకు తీసుకువస్తాడు? పైగా ఆమె తనను ప్రేమిస్తుందా, లేదా అనే విషయం అతడికే తెలీదు. ఒక నాట్య ప్రదర్శన ఇవ్వాల్సిన ఆమె, దానికోసమే తనను తీసుకువెళ్లడానికి కృష్ణ వచ్చాడని ఎలా గుడ్డిగా నమ్ముతుందో, అతడితో పాటు బయటకు ఎందుకు వస్తుందో అస్సలు అర్థం కాదు. ఈ లాజిక్‌లేని సన్నివేశాలు స్క్రీన్‌ప్లేను వీక్‌గా మార్చేశాయి. ఇష్టంలేకపోయినా ఎన్‌కౌంటర్లు చేస్తున్నట్లు కనిపించే ఎస్సై రంజిత్ (నవీన్ చంద్ర) ఇంట్లోంచి బయటకు వస్తూ వస్తూ, ఇంటి ముందే బేడీలు వేసి నిల్చొని ఉన్న ఇద్దరు రౌడీలను భార్య కళ్లముందే టప టపా కాల్చేసి, జీపు ఎక్కి వెళ్లిపోతాడు. అప్పుడే వచ్చిన పనిమనిషి.. "అయ్యగారు ఇలా చేశారేమిటమ్మా?" అని ఎస్సై భార్యతో విడ్డూరంగా అంటుంది. ఎదురుగా ఉన్న ఆ రౌడీల శవాలను ఆమె ఏం చేసిందో? ఏమో?
ఆ ఎస్సై సిరిసిల్లలోని గొడవ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి గాల్లో తుపాకి పేల్చడంతో ఇరు వర్గాలు అక్కడ్నుంచి పారిపోయి, వేరే సందుగొందుల్లో కొట్టుకుంటూ ఉంటాయి. ఎస్సైగారు జీపు బానెట్ మీద కూర్చొని ఎస్పీ (అజయ్)కి ఫోన్ చేసి, ఎప్పటికప్పుడు ఊరి గొడవ గురించి రిపోర్ట్ చేస్తూ కూర్చుంటాడు. ఆ ఎస్పీ ఏమో హోమ్ మినిస్టర్ (శుభలేఖ సుధాకర్)కు ఈ విషయం రిపోర్ట్ చేస్తుంటాడు. ఆ ఇద్దరి మధ్యా సంభాషణ ఒక ఫార్స్‌లా నడుస్తుంటుంది. ఎస్పీకి రాజ్యాంగం గురించి, ఆ రాజ్యాంగాన్ని మనం ఎలా ఉల్లంఘిస్తున్నామనే దాని గురించి లెక్చర్లు దంచుతుంటాడు మినిస్టర్. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందనీ, సమాజంలో ఎన్ని కులాలు ఉన్నా న్యాయం విషయంలో అందరూ సమానులేనని చెప్పిందనీ, కులాల పేరిట కొట్టుకు చావొద్దనీ, తక్కువ కులాలవారూ మనుషులేనీ, వాళ్ల రక్తం కూడా అందరి రక్తంలాగే ఉంటుందనీ చెప్పాలనేది దర్శకుడి ఉద్దేశంగా కనిపిస్తుంది. కానీ బలమైన సన్నివేశాలు ఉన్నప్పుడే మనం చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకుడికి సరిగ్గా అందుతుంది. లెక్చర్ల వల్లా, బలహీనమైన సన్నివేశాల వల్లా ఆ మంచి ఉద్దేశం నీరుగారిపోయిందనే చెప్పాలి.
పెద్ద కులానికి చెందిన వ్యక్తి అయివుండి కూడా రామన్న (సాయికుమార్) అభ్యుదయ భావాలు కలిగిన వాడిగా కనిపిస్తాడు. నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లి, అక్కడ కూడా కులమే ఆధిపత్యం వహిస్తోందని తెలిసి, బయటకు వస్తాడు. అందరూ సమానులేనని చెబుతూ, ఊళ్లో తమ కులానికే చెందిన మరో వర్గానికి ప్రత్యర్థి అవుతాడు. అలాంటివాడు కూడా ఒకసారి ప్రత్యర్థి మనిషిని పట్టుకొని "జాతి తక్కువ నా కొడకా" అనేస్తాడు. డైలాగ్స్ రాసేప్పుడు ఎవరికి ఏం రాస్తున్నామో చూసుకోవక్కర్లేదా? ఇంకో సీన్ మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. బయట తమవాళ్లకు అపాయం పొంచివుందని తెలిసి కొత్తగా అప్పుడే పెళ్లయిన జంటలో భర్త బయటకు వెళ్లి, ఎంతసేపైనా రాకపోయేసరికి భార్య (శరణ్య) అతడి కోసం బయటకు రావడం, ఆ ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొని, దగ్గరవుతున్నంతలో చటుక్కున ఎవడో వచ్చి, "నేను నిన్ను ప్రేమిస్తే, నువ్వు వాడిని చేసుకుంటావా?" అని ఆమెతో అంటూ ఆ భర్తమీద పెట్రోల్ పోసి, తగలబెట్టడం.. ఏంటిది? నిర్మానుష్యంగా ఉండే రోడ్లపైకి ఆ కొత్తజంట బయటకు వస్తుందని ముందే ఊహించి, పెట్రోల్‌తో రెడీగా ఉంటాడా వాడు? ఏంటిది డైరెక్టరూ?
క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఆకట్టుకొనేలా లేవు. రామన్న వ్యక్తిత్వం ఒక్కసారిగా ఊడ్చుకుపోయిన సందర్భం అది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ రంజిత్ నిస్సహాయుడైనపోయిన సన్నివేశం అది. ఊళ్లలోని మనుషులు మారరని తేల్చేసే సందర్భం అంది. అంతదాకా ఒకరకంగా ఉన్న పుష్పకు అప్పుడే జ్ఞానోదయం కలిగిన కీలక సన్నివేశం అది.. అలాంటి సీన్‌ను ఇంకా బాగా తీసి ఉండాల్సింది. బ్యాగ్రౌండ్ సంగీతం, పాటలకు ఇచ్చిన సంగీతం బాగానే ఉంది. బలహీనమైన సన్నివేశాలను సినిమాటోగ్రఫీ కాపాడలేకపోయింది. సినిమా ఒక గంటా 56 నిమిషాల నిడివే ఉన్నప్పటికీ ఎడిటింగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
నటీనటుల అభినయం
సినిమాలో ఆకట్టుకున్న అంశాలేమైనా ఉన్నాయంటే.. అది కృష్ణ, పుష్ప పాత్రల్లో కార్తీక్ రత్నం, కొత్తమ్మాయి కృష్ణప్రియ నటనే. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. బలహీనమైన కృష్ణ పాత్రను, తమ ఊరు రావణ కాష్టం కావడానికి కారణమైన పాత్రను కార్తీక్ బాగా చేశాడు. అతడి హావభావ ప్రదర్శన ప్రశంసనీయం. పుష్ప పాత్రలోని ముగ్ధత్వాన్ని కృష్ణప్రియ బాగా ప్రదర్శించింది. రామన్నగా సాయికుమార్, ఎస్సైగా నవీన్ చంద్ర, ఊరి పెద్దగా రంగరాజు, ఈరన్నగా రాజా రవీంద్ర పాత్రల పరిధిలో ఒదిగారు. అజయ్, శుభలేఖ సుధాకర్, ఆమని, పవిత్రా లోకేశ్, దిల్ రమేశ్ లాంటివాళ్లు ఓకే అనిపించారు. సుహాస్ ఒక సీన్‌లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్స్‌గా నటించిన సద్దాం, మరో ఇద్దరు ఫర్వాలేదు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
మంచి సీరియస్ పాయింట్‌ను బలహీనమైన సన్నివేశాలు, కథనంతో డిజప్పాయింట్‌మెంట్ కలిగించిన సినిమా 'అర్ధ శతాబ్దం'.
రేటింగ్: 2/5
- బుద్ధి యజ్ఞమూర్తి