English | Telugu
వాణిశ్రీని జూనియర్ ఆర్టిస్ట్ అంటూ చులకన చేసిన చంద్రమోహన్!
Updated : May 17, 2021
మహానటి సావిత్రి తర్వాత ఇండస్ట్రీని ఏలిన తార వాణిశ్రీ. ఒంటి రంగు నలుపు అయినా తన స్టైల్‌తో, తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొని, తెలుగువారి ఆరాధ్య తారగా మారారామె. ఒక దశాబ్దం పాటు ఆమె నంబర్‌వన్ నాయికగా ఓ వెలుగు వెలిగారు. ఆ టైమ్‌లో టాప్ హీరోలు సైతం ఆమె కోసం వెయిట్ చేసేవారంటే అతిశయోక్తి కాదు. చంద్రమోహన్ తొలి హీరోయిన్ ఆమెనే. 'రంగుల రాట్నం' (1967) సినిమా ద్వారా చంద్రమోహన్‌ను హీరోగా పరిచయం చేశారు ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్. రెడ్డి. ఆ సినిమాలో నాయికగా వాణిశ్రీని ఆయన ఎంచుకున్నారు. కానీ ఆయన నిర్ణయం చంద్రమోహన్‌కు నచ్చలేదు. ఆయన కంటికి వాణిశ్రీ ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా కనిపించింది. ఆమె వద్దనీ, మరొకర్ని తీసుకొమ్మనీ బి.ఎన్. రెడ్డికి ఆయన సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు చంద్రమోహన్.
"హీరోగా నా ఫస్ట్ పిక్చర్ 'రంగుల రాట్నం'లో హీరోయిన్‌గా వాణిశ్రీని బుక్ చేశారు బి.ఎన్. రెడ్డి గారు అప్పటిదాకా ఆమె సైడ్ రోల్స్ చేస్తూ వస్తోంది. చెలికత్తె వేషాలు, బాలకృష్ణ పక్కన, పద్మనాభం పక్కన కామెడీ వేషాలు వేస్తోంది. నేను బి.ఎన్. రెడ్డి గారితో అన్నాను.. 'హీరోగా ఇది నా ఫస్ట్ పిక్చర్. నా పక్కన ఈమె హీరోయిన్ అంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ లాగుంది. వద్దండీ.' అని చెప్పాను. 'ఒన్ ఫైన్ మార్నింగ్ షి రూల్ ది ఇండస్ట్రీ. ఆవిడ వెంట హీరోలు పడతారు.' అన్నారు బి.ఎన్. రెడ్డి గారు. ఏం సార్.. ఆమె వేస్తున్న వేషాలేంటి? ఆమె ఎప్పటికీ ఆ రేంజ్‌కి రాదన్నాను. 'కాదయ్యా. అది బార్న్ ఆర్టిస్ట్.' అని బల్లచరిచి చెప్పారాయన. ఆయన చెప్పినట్లే పదేళ్లు ఇండస్ట్రీని ఏలింది వాణిశ్రీ. సోకాల్డ్ హీరోలు ఆమె కోసం వెయిట్ చేస్తూ కూర్చొనేవారు." అని చెప్పారు చంద్రమోహన్.
ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్ర హీరో కూడా సెట్‌లో ఆమె కోసం వెయిట్ చేసిన సందర్భాన్ని ఆయన పంచుకున్నారు. "నాగేశ్వరరావుగారి 'సెక్రటరీ' (1976)సినిమా చేస్తున్నాం. అది యద్దనపూడి సులోచనారాణి నవలతో తీస్తున్న సినిమా. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఓపెన్ అయ్యింది. దాన్ని రామారావు గారి చేత ఓపెన్ చేయించారు నాగేశ్వరరావుగారు. 'సెక్రటరీ' షూటింగ్‌ని ఆ ఫ్లోర్‌లో మొదలుపెట్టారు. దానికి రాఘవేంద్రరావు గారి ఫాదర్ కె.ఎస్. ప్రకాశరావుగారు డైరెక్టర్. అందులో నాది మంచి వేషం. అప్పటికే వాణిశ్రీ స్వింగ్‌లో ఉంది. అప్పుడు 9 గంటల కాల్‌షీట్‌కు 11 గంటలకు సెట్‌కు వచ్చేది. నాగేశ్వరరావు గారితో సహా అందరం బయట కూర్చొని ఆమె కోసం వెయిట్ చేసేవాళ్లం. రాగానే 'రెడీ అవడానికి కొంచెం లేటయ్యిందండీ' అనేది. 'పర్లేదమ్మా.. పర్లేదమ్మా' అనేవారు నాగేశ్వరరావుగారు. అట్లా ఆనాటి హీరోలను వెయిట్ చేయించింది వాణిశ్రీ." అని చెప్పుకొచ్చారు చంద్రమోహన్.