English | Telugu
నా పేరిట ఎవరికీ విరాళాలు ఇవ్వకండి.. నేరుగా నాకే ఇవ్వండి!
Updated : May 18, 2021
సీనియర్ నటి పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనీ, ఇంటి అద్దె కూడా బకాయి పడ్డారనీ వార్తలు వచ్చిన విషయమే. అయితే తనపేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తుండటం తనకు బాధ కలిగిస్తోందనీ, అవార్డులు అమ్మి జీవిస్తున్నానంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదనీ ఆమె చెప్పారు. తాను ఆర్థిక కష్టాల్లో ఉన్న మాట నిజమేననీ, తన పేరిట డబ్బులు వసూలు చేసేవారికి వాటిని ఇవ్వవద్దనీ, వాటిని నేరుగా తనకే ఇవ్వాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు.
కొంతమంది నా పేరుతో డబ్బులు వసూలుచేసి లక్ష రూపాయలు కట్టి మాలో సభ్యత్వం ఇప్పిస్తామని చెబుతున్నారనీ, మా వారు ఇచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ కోసం లక్ష రూపాయలను ఈ వయసులో మా వారికి కట్టుకోవాల్సిన అవసరం ఉందా? అని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బులేవో తనకే ఇస్తే, మూడు నెలల అద్దె బకాయి చెల్లించుకుంటానని శ్యామల చెప్పారు. తనకు కుక్కర్లు, కూలర్లు ఇవ్వాల్సిన పని లేదనీ, కూతురికీ, తనకూ కలిపి మందులకే నెలకు పది వేల రూపాలయకు పైనే అవుతున్నాయని శ్యామల వెల్లడించారు.
తనకు సాయం చేయాలనుకున్న దాతలు తన పేరిట ఎవరికీ విరాళాలు ఇవ్వవద్దనీ, నేరుగా తనకే ఇవ్వాలనీ కోరారు. ఆత్మగౌరవంతో, ఉత్తమ నటనా ప్రతిభతో, అవార్డులతో గౌరవంగా బతుకుతూ వస్తున్నాననీ, కొంతమంది తన పరువును బజారున పెట్టి, ఏదో ఆదుకుంటున్నట్లుగా టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం తనకు బాధ కలిగిస్తోందనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరైనా సాయం చేయాలనిపిస్తే నేరుగా తన ఫోన్ నెంబర్ 9849175713 లో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అకౌంట్ లో వేసినా బ్యాంకు కు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి లేదని, గూగుల్ పే, పేటిఎం లాంటివి తనకు లేవనీ ఆమె స్పష్టం చేశారు. ఫోన్ లో సంప్రదించి నేరుగా తనకు డబ్బులు అందించాలని, తనకు మధ్యవర్తులు ఎవ్వరూ లేరని శ్యామల వివరించారు.