English | Telugu
విజయశాంతి ఫైట్ కాదు, కావాలంటే నా ఫైట్ తీసేయండి.. అని చెప్పిన 'రౌడీ ఇన్‌స్పెక్టర్'!
Updated : Jun 10, 2021
మహానటుడు ఎన్టీఆర్ వారసుడు కావడం బాలకృష్ణకు ఓ అదృష్టం అయితే, ఎన్టీఆర్ ఇమేజ్ ఆయనకు ఓ పెద్ద బరువు. ఎన్టీఆర్ ఎన్నో రకాల పాత్రలను అవలీలగా చేశారు. నవరసాలను అవలీలగా పోషించారు. దాంతో ఆయన నటనతో బాలయ్య నటనను తూచేవారు. బాలయ్య ఏ పాత్ర చేసినా, ఇంతకు ముందు ఇది ఎన్టీఆర్ చేసిందే కదా అనేవారు. ఇలాంటి పరిస్థితి ఇతర నటవారసులకు లేదనే చెప్పాలి. అయినా కష్టపడి పనిచేస్తూ ఇప్పటిదాకా నందమూరి తారకరామారావు లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారంటే తేలిగ్గా తీసేయదగ్గ విషయం కాదు.
సినిమాలు బ్లాక్‌బస్టర్ అయిన వెంటనే కొంతమంది స్టార్లు అమాంతం రెమ్యూనరేషన్ పెంచేస్తుంటారు. కానీ బాలయ్య సినిమా కోసం నిర్మాత పెట్టే డబ్బును దృష్టిలో వేసుకొని నటిస్తూ వస్తున్నారు తప్పితే, ఎప్పుడూ డబ్బు కోసం ఆయన పనిచేస్తున్నట్లు మనం చూడలేదు. అంతేకాదు, ఇతర పాత్రలకు పేరొస్తుందని భావిస్తే కొంతమంది హీరోలు దర్శకులపై ఒత్తిడి తెచ్చి, ఆ పాత్రల నిడివిని తగ్గించే ప్రయత్నాలు చేస్తుంటారు. బాలయ్య అలాంటి పనులకు బహు దూరం.
ఉదాహరణకు 'రౌడీ ఇన్‌స్పెక్టర్' (1992) సినిమా ఉదంతమే తీసుకోవచ్చు. ఆ మూవీలో హీరోయిన్ విజయశాంతికి కూడా రెండు ఫైట్లు ఉన్నాయి. ఎడిటింగ్ సందర్భంలో వాటిలో ఓ ఫైట్‌ను తీసేయాలని డైరెక్టర్ బి. గోపాల్ అనుకున్నారు. ఆ విషయం బాలయ్యకు చెబితే, ఆయన ఒప్పుకోలేదు. "ఆ అమ్మాయి అంత కష్టపడి ఫైట్ చేస్తే తీసేయడం న్యాయం కాదు, కావాలంటే నా ఫైట్స్‌లో ఒకటి తీసేయండి." అని చెప్పడంతో గోపాల్ గతుక్కుమన్నారు. అదీ బాలయ్య అంటే! ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దాన్ని తమిళంలో విజయశాంతి క్యారెక్టర్‌ను హైలైట్ చేస్తూ 'ఆటోరాణి' పేరుతో రిలీజ్ చేసినా, బాలకృష్ణ ఏమాత్రం ఫీలవలేదు. అలాగే హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. విశేషమేమంటే ఈ మూడు భాషల్లోనూ ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఆ సినిమా తర్వాత మరే సినిమా ఈ రికార్డును సాధించలేదు.