English | Telugu
"అప్పలు కప్పలగును.. అన్నము సున్నమగును".. అందరినోటా బాలయ్య మాట!
Updated : Jun 10, 2021
అన్ని విషయాల్లోనూ తనకు తండ్రి నందమూరి తారకరామారావు ఆదర్శమని తరచూ బాలకృష్ణ చెబుతుంటారు. తొమ్మిదో తరగతి చదువుతూ తొలిసారిగా 'తాతమ్మ కల' సినిమాతో కెమెరా ముందుకు వచ్చిన బాలయ్య, ఆ తర్వాత ఎన్టీఆర్ చిత్రాల్లోనే నటించారు. బాలకృష్ణతో సినిమాలు చేయడానికి బయటి నిర్మాతలు ఎంతో ఆసక్తి ప్రదర్శించినా, చదువు పాడవుతుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ అంగీకరించలేదు. ఒకవైపు చదువుకుంటూనే తీరిక లభించినప్పుడల్లా సొంత సినిమాల్లో నటిస్తూ వచ్చారు బాలయ్య.
ఆ విధంగా వేములవాడ భీమకవి, దానవీరశూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాటపర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, అనురాగదేవత, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, సింహం నవ్వింది చిత్రాల్లో తండ్రితో కలిసి నటించారు. 'సాహసమే జీవితం'తో సోలో హీరోగా మారక ముందు ఆయన బయటి నిర్మాతలకు చేసింది రెండే సినిమాలు. ఒకటి బాలనటుడిగా ఉన్నప్పుడు అన్నయ్య హరికృష్ణతో నటించిన 'రామ్-రహీమ్', ఇంకొకటి ఎన్టీఆర్ తమ్మునిగా నటించిన 'అన్నదమ్ముల అనుబంధం'.
1975, 76 ప్రాంతాల్లో సంయుక్త రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర నినాదాలు మారుమోగుతున్న సందర్భంలో తెలుగువారమంతా ఒక్కటే అనే భావం జనంలో కలగజేయాలని నిర్ణయించుకున్న ఎన్టీఆర్ మనసులో 'వేములవాడ భీమకవి' కథ మెదిలింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహాకవి వేములవాడ భీమకవి. ఆయన చరిత్రను అధ్యయనం చేసి, తనే కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చి, యోగానంద్ డైరెక్షన్‌లో ఆ సినిమాని తీశారు. తాను ప్రత్యేక పాత్ర పోషించి, బాలకృష్ణతో టైటిల్ రోల్‌ను పోషింపజేశారు ఎన్టీఆర్.
నటునిగా అది బాలకృష్ణకు కేవలం నాలుగో చిత్రం. పదిహేనేళ్ల వయసులో భీమకవి పాత్రను చక్కగా పోషించారు బాలయ్య. ఆ సినిమాలో "అప్పలు కప్పలగును.. అన్నము సున్నమగును.." అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కు థియేటర్లో చప్పట్లు మిన్నుముట్టాయి. బయటకు వచ్చాక కూడా జనం ఆ డైలాగ్‌ని చాలా కాలం చెప్పుకుంటూ వచ్చారంటే, దాని ప్రభావం ఎంతగా పడిందో ఊహించుకోవాల్సిందే. బాక్సాఫీస్ దగ్గర 'వేములవాడ భీమకవి' పరాజయం పాలయినా, బాలకృష్ణ నటన, ఆయన చెప్పిన డైలాగులు మాత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.